మధ్యాహ్న భోజన పథక(midday meal scheme in nalgonda district) లక్ష్యం నీరుగారుతోంది. నల్గొండ జిల్లా హాలియా మున్సిపాలిటీలోని ఇబ్రహీంపేట ప్రాథమికోన్నత పాఠశాలలో కొందరి విద్యార్థులకు మంగళవారం కూరకు బదులు కారంపొడి వేశారు. ఈ పాఠశాలలో 7వ తరగతి వరకు 125 మంది విద్యార్థులుండగా.. రోజూ 80 నుంచి 90 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. మధ్యాహ్న భోజనంలో పర్యవేక్షణ కొరవడడంతో మంగళవారం వండిన ఆలుగడ్డ కూర సరిపోలేదు. 10 మంది విద్యార్థులకు అన్నం, కారంపొడి పెట్టగా.. నోరు మండి చిన్నారులు విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు.
పాఠశాలకు చేరుకున్న విద్యా కమిటీ ఛైర్మన్, పలువురు తల్లిదండ్రులు ప్రధానోపాధ్యాయుడితో వాగ్వాదం చేశారు. మెనూ ప్రకారమే భోజనం పెడుతున్నామంటూ ప్రధానోపాధ్యాయుడు... దురుసుగా సమాధానం చెబుతున్నారని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ నెల 8న కూడా తగినంతగా ఆహారం వండని కారణంగా కొంతమంది విద్యార్థులు ఆకలితో బాధపడినట్లు తెలిసిందని తల్లిదండ్రులు వాపోయారు. వెంటనే ప్రధానోపాధ్యాయునిపై చర్యలు తీసుకోవాలని వారు అధికారులను కోరారు.
ఇదీ చదవండి: గొంతులో ఇరుక్కుపోయిన మాంసం ముక్క.. తరువాత ఏమైందంటే..