Lack Of Facilities In Cheruvugattu Temple: నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలంలోని చెరువుగట్టు శ్రీ జడల రామలింగేశ్వరస్వామి దేవస్థానం.. ప్రముఖ శైవ క్షేత్రంగా విరాజిల్లుతోంది. ప్రతిరోజు వేలాది మంది భక్తులు స్వామి వార్లను దర్శించుకుంటారు. ఆదాయం భారీగానే వస్తున్నా.. అందుకు తగ్గట్టు వసతులు ఏర్పాటు చేయట్లేదు. ఏళ్లుగా ఇక్కడే పాతుకుపోయిన కొందరు ఉద్యోగులు, పూజారుల మాయాజాలంతో క్షేత్రానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు.
టెండర్ల ప్రకటన నుంచి దుకాణాల నిర్వహణ వరకు అందరికీ ఒకే రేటు నిర్ణయించి.. కొందరు ఆడిందే ఆటగా ఇక్కడ కొనసాగుతుందని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సోమవారాలు, అమావాస్య ఇతర ప్రత్యేక దినాల్లో సుమారు 40,000 మంది వరకు భక్తులు క్షేత్రానికి వస్తుండగా.. వారికి వసతులు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 2 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారన్న భక్తులు: ఇప్పటికీ కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలున్నాయి. కనీసం శౌచాలయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని... భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భక్తులు స్నానం చేసే గుండంలో నీరు మంచిగా లేకపోవడానికి తోడు.. అక్కడే దుస్తులు ఉతుకుతుండటంతో.. రోగాలు వచ్చే దుస్థితి నెలకొంది. గుట్టపైకి వెళ్లేటప్పుడు వసూలు చేసే పార్కింగ్ ఫీజు నుంచి మొదలుకొని.. తలనీలాల వరకు అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు.
అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు: బోనం సమర్పించాలంటే రూ.1000 వరకు చెల్లించాల్సిన పరిస్థితి. పైన ఉన్న మూడు గుండ్ల దర్శనానికి ఎలాంటి టోకెన్లు లేకుండా ప్రతి భక్తులు పది రూపాయలు సమర్పించుకోవాల్సిందే . ఇక్కడి పరిస్థితులపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా కీలకమైన స్వామివారి కల్యాణ మహోత్సవం నిర్వహించే మండప విస్తరణ పనులు.. ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి.
భక్తులు తరలిరావడంతో వాహనాలతో.. ఘాట్ రోడ్డు నిండిపోతోంది. భక్తుల అవస్థలను దృష్టిలో ఉంచుకుని.. అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. భక్తులకు తాగునీటి కోసం మిషన్ భగీరథ నీరును తరలిస్తున్నామని తెలిపారు. ఏటా ఆలయానికి రూ.12 కోట్ల వరకు ఆదాయం వస్తున్నా.. మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు శ్రద్ధ చూపడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా కనీస సౌకర్యాలు కల్పించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
"కనీసం శౌచాలయాలు లేవు. గుండంలో నీరు సరిగ్గా లేవు. నిద్రపోవడానికి వసతులు లేవు. తద్వారా రోడ్లపైనే నిద్రించాల్సి వస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలి." -భక్తులు
"భక్తుల కోసం శాశ్వత శౌచాలయాలు నిర్మిస్తున్నాం. తాగునీటి కోసం మిషన్ భగీరథ నీటిని తరలిస్తున్నాం. వీటిని బ్రహ్మొత్సవాలలోపే అందుబాటులోకి తెచ్చెందుకు పనులు చేపట్టాం. మండప విస్తరణ పనులను త్వరలోనే పూర్తిచేస్తాం." -నవీన్, ఈవో
ఇవీ చదవండి: ఎన్నికలే అజెండాగా.. పాలమూరు వేదికగా బీజేపీ సమావేశాలు
సొంతకాళ్లపై నిలబడుతున్న ట్రాన్స్జెండర్లు.. స్పెషల్గా హోటల్ పెట్టి..