పేదింటి పెద్ద బిడ్డగా.. ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆడబిడ్డల పెళ్లి కోసం అందిస్తున్న కల్యాణలక్ష్మి సొమ్మును మహిళా సంఘం అప్పు కింద జమ కట్టారు బ్యాంకు అధికారులు. నల్గొండ జిల్లా మునుగోడుకు చెందిన బొడ్డు కమలమ్మ గతేడాది తన పెద్ద కుమార్తె వివాహం చేసింది. కల్యాణలక్ష్మి కోసం దరఖాస్తు చేయగా ఇటీవలే మంజూరైంది. జూన్ 16న స్థానిక ప్రజాప్రతినిధులు సంబంధిత చెక్కును కమలమ్మకు అందజేశారు. ఆ చెక్కును మండల కేంద్రంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో ఉన్న తన ఖాతాలో జమచేసుకుంది.
డబ్బు డ్రా చేద్దామనుకునే సరికి.. ఆ బ్యాంక్ అధికారులు చెప్పిన మాట విని విస్తుపోయింది. తాను సభ్యురాలిగా ఉన్న మహిళా సంఘం అప్పు చెల్లించాల్సి ఉన్నందున ఆ నగదును హోల్డ్‌లో పెట్టామని తెలిపారు. ఈ విషయంపై ఈటీవీ భారత్(Etv Bharat Effect)లో " కల్యాణలక్ష్మి డబ్బును హోల్డ్ చేసిన బ్యాంకు.. ఎందుకంటే..? " ప్రచురించిన కథనానికి స్పందన(Etv Bharat Effect) వచ్చింది. ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి.. నగదును బాధితురాలికి ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని లీడ్ బ్యాంక్ మేనేజర్ సూర్యం నాయక్‌ను కోరారు. వెంటనే సంబంధిత బ్యాంక్ అధికారులతో మాట్లాడిన సూర్యం.. ఆ నగదును హోల్డ్‌లో నుంచి తీయించారు. ఎల్డీఎం ప్రత్యేక చొరవతో కమలమ్మ తన నగదును డ్రా చేసుకున్నారు. తన డబ్బు తనకు ఇప్పించిన ఆర్డీఓ, ఎల్డీఎం, ఈటీవీకి కృతజ్ఞతలు తెలిపారు.