రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం నమోదైన 20 మండలాల్లో 18 మండలాలు ఉమ్మడి నల్గొండ జిల్లాలోనివే. వర్షం ప్రభావం ఆ మండలాల్లోని పంటలపై తీవ్రస్థాయిలో కనపడింది. ధనరాశులు ఇంటికొచ్చే సమయంలోనే ధాన్యపు రాశులు నీటిలో కొట్టుకుపోయాయని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఆరుగాలం పడిన కష్టమంతా నీటిపాలైందని కన్నీరుమున్నీరవుతున్నారు.
నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో లక్షా 75 వేల ఎకరాల్లో పంట నష్టం చోటుచేసుకోగా.. వరి పంటే లక్ష ఎకరాల్లో ఉండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. రూ.400 కోట్లకుపైనే రైతులు నష్టాన్ని మూటగట్టుకున్నారని అధికారులు అంచనా వేశారు. క్షేత్రస్థాయిలో పంటల తీరును పరిశీలించిన అధికారులు.. వరి, పత్తి పెద్దఎత్తున దెబ్బతిన్నట్లు నిర్ధరించారు. పంట నష్టం విస్తీర్ణాన్ని నమోదు చేస్తున్న వ్యవసాయ శాఖ.. పూర్తిగా ఎంత కోల్పోయారు, పాక్షికంగా జరిగిన నష్టమెంత అన్న అంశాలను బేరీజు వేస్తున్నారు. గత మూడు దశాబ్దాల్లో ఎన్నడూ ఎరుగనటువంటి రీతిలో నల్గొండ, యాదాద్రి జిల్లాల్లో నమోదైన వర్షాలతో.. కొద్ది గంటల వ్యవధిలోనే కోట్లాది రూపాయల పంట పనికిరాకుండా పోయింది.
ఈనెల 13న కురిసిన వర్షం వల్లే మూడు జిల్లాల్లోని లక్ష ఎకరాల వరిసాగు నీటమునిగింది. కోతకు వచ్చిన పైరంతా.. నేలకొరిగి కర్షకులకు కన్నీటిని మిగిల్చింది. మరికొన్ని ప్రాంతాల్లో.. నీటిపాలవుతున్న ధాన్యాన్ని కాపాడుకోలేక, చూస్తూ ఉండటం తప్ప ఏమీ చేయలేక అన్నదాతల గుండెలు బద్ధలయ్యాయి.
మూడు జిల్లాల పరిధిలో 10 లక్షల ఎకరాల్లో పత్తిని పండించారు. అందులో 76 వేల ఎకరాల్లో పంట నీటమునగగా.. 30 వేల ఎకరాల్లో దిగుబడి వచ్చేది అనుమానమేనని అంటున్నారు. అటు ఫసల్ బీమా యోజన కూడా లేకపోవడం వల్ల.. లక్షా 75 వేల ఎకరాల్లో ఒక్క ఎకరానికి కూడా పరిహారం వచ్చే అవకాశం లేకుండా పోయింది. గత నెలలో కురిసిన వర్షం వల్ల జరిగిన నష్టాన్ని మరవకముందే.. మరోసారి సాగుదారులపై పిడుగు పడ్డట్లయింది. కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. కోల్పోయిన పంటకు పరిహారం దక్కితేనే మరో పంట వేసే అవకాశముంటుందని రైతులు అంటున్నారు.