Gutha Sukhender Reddy Fires On BJP: ఏడాది కాలంగా తెలంగాణలో జరుగుతున్న పరిణామాల వెనుక సమైక్యవాదుల కుట్రలు ఉన్నాయని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఆరోపించారు. సీబీఐ, ఈడీలతో సీఎం కేసీఆర్‌ను మానసికంగా దెబ్బ కొట్టేందుకు మూకుమ్మడిగా దాడి చేస్తున్నారని విమర్శించారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలను ఒత్తిడి చేస్తూ వేధిస్తున్నాయని మండిపడ్డారు. మోదీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని ఏడు మండలాలను ఏపీలో కలిపారని ఆయన గుర్తు చేశారు.
దేశంలో ప్రభుత్వాలను కూల్చే కుట్రలు.. అనిశ్చితకరమైన వాతావరణం ఉందని గుత్తా సుఖేందర్రెడ్డి తెలిపారు. ఏపీలో చేతకాక.. తెలంగాణలో రాజకీయాలు చేయాలని కొందరు వస్తున్నారని ఆక్షేపించారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని పేర్కొన్నారు. బీజేపీ దత్త పుత్రిక షర్మిల పాదయాత్రల పేరుతో కేసీఆర్‌ను అప్రతిష్ట పాలు చేస్తోందని ఆరోపించారు. కానీ అవినీతికి పాల్పడి జైలుకు వెళ్లడమే కాకుండా.. ఐఏఎస్ అధికారులను సైతం జైలుకు పంపిన చరిత్ర వాళ్లదని విమర్శించారు.
"ఈరోజు కేసీఆర్ నాయకత్వంలో 8 సంవత్సరాల పాలన ప్రజారంజకగా సాగుతుంది. అలాంటి పాలనను అప్రతిష్ట పాలు చేయడానికే కొందరు పాదయాత్రలు చేస్తున్నారు. ఏపీలో చేతకాక ఇక్కడ పాదయాత్రలు చేస్తున్నారు. బీజేపీ దత్తపుత్రిక చేసే పాదయాత్రలో కేంద్రం ధరలు ఎందుకు పెంచిందో అడగరు. ఏడు మండలాలు ఏపీలో కలిపారు దాని గురించి అడగరు. కానీ కేసీఆర్‌ను వారి కుటుంబాన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. అవినీతికి పాల్పడి జైలుకు వెళ్లడమే కాకుండా.. ఐఏఎస్ అధికారులను సైతం జైలుకు పంపిన చరిత్ర వారిది." - గుత్తా సుఖేందర్రెడ్డి శాసనమండలి ఛైర్మన్
ఇవీ చదవండి: గ్రూప్ 4 ద్వారా వార్డు అధికారుల నియామకం ఓ వినూత్న చర్య: కేటీఆర్
మూసేవాలా హత్య కేసు సూత్రధారి అరెస్ట్.. కాలిఫోర్నియాలో చిక్కిన గోల్డీ బ్రార్!