gutha sukender reddy fires on BJP: మునుగోడు ఉపఎన్నికలో కేసీఆర్ లౌకిక వాదులు గెలిచారని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. భాజపా నిరంకుశ విధానాలను మునుగోడు ప్రజలు తిప్పి కొట్టారన్న ఆయన.. మతోన్మాద, విచ్ఛిన్నకర శక్తులకు చంప పెట్టులా తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. నల్గొండలోని తన నివాసంలో మాట్లాడిన గుత్తా కేంద్రంపై విమర్శనాస్త్రాలు సంధించారు. తెలంగాణలో విచ్ఛిన్నకర శక్తులకు స్థానం లేదని ఈ ఉపఎన్నికతో రుజువైందన్నారు.
సామాన్యుడు ఎన్నికల్లో పోటీచేయలేని పరిస్థితి నెలకొందని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. మునుగోడు ఉపఎన్నిక అన్ని పార్టీలకు గుణపాఠం నేర్పిందన్న ఆయన.. ఐటీని ప్రయోగించే స్థితికి రావటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయ ఆత్మహత్య కోసమే మునుగోడు ఉపఎన్నిక పనికొస్తుందన్న ఆయన.. అనవసరమైన ఇలాంటి చర్యలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేయటం సరికాదని చెప్పారు.
'అన్ని పార్టీలకు పాఠం నేర్పిన మునుగోడు ఉపఎన్నిక. ఐటీనీ ప్రయోగించే స్థాయికి దిగజారటం సరికాదు. కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయ ఆత్మహత్య కోసమే ఉపఎన్నిక. ప్రభుత్వాలు పనిచేయకుండా అడ్డంకులు సృష్టించే చర్యలివి. సామాన్యుడు ఎన్నికల్లో పోటీచేయలేని పరిస్థితి నెలకొంది.'- గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనమండలి ఛైర్మన్
దేశానికి మార్గదర్శకంగా రాజకీయాలు ఉండాలని గుత్తా సూచించారు. దేశ రాజకీయాల్లో కేసీఆర్ అవసరం చాలా ఉందన్నారు. సామాన్య ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా సీఎం కేసీఆర్ పాటు పడతారన్న ఆయన.. కేసీఆర్పై ప్రజలకు నమ్మకం పెరిగిందన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ నేడు నంబర్ వన్ స్థానంలో నిలిచిందన్నారు. ఇవాళ తెలంగాణ మోడల్ దేశానికి అవసరం ఉందన్న గుత్తా.. పన్నులు వేస్తూ ప్రజలను దోచుకుంటున్న భాజపాకి మునుగోడు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని విమర్శించారు.
ఇవీ చదవండి: