Gutha Sukender on Nalgonda MLA Seats : రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఒకరిపై మరొకరు విమర్శల వర్షం గుప్పిస్తూ.. ఒకరి వైఫల్యాలు మరొకరు ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. ఈ క్రమంలోనే ఓటర్లను ఆకర్షించేందుకు హామీల వర్షం కురిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో అధికారం మాదంటే మాదంటూ ప్రధాన పార్టీల నేతలు ఒకటే పాట పాడుతున్నారు.
Gutha Sukender on TS Assembly Elections 2023 : ముఖ్యంగా అధికార పార్టీ బీఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లోనూ విజయఢంకా మోగిస్తామని ధీమాతో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ముఖ్యంత్రి కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో 100పైగా స్థానాలను గెలుస్తామని చెప్పిన విషయం తెలిసిందే. మరో వైపు కేటీఆర్ ఈ దఫా ఎన్నికల్లో అత్యధిక మెజారీటీతో మళ్లీ అధికారాన్ని దక్కించుకుంటామని చెప్పారు. మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం ఈసారి కేసీఆర్‌ను గద్దె దించడమే తమ లక్ష్యమని బల్ల గుద్ది చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ కూడా రాబోయే ఎన్నికల్లో గెలుపు బీఆర్ఎస్దేనని జోస్యం చెప్పారు.
Gutha Sukender on TS Decade Celebrations : తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో ఆయన రాబోయే ఎన్నికల గురించి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్దే విజయం అని బల్లగుద్ది చెప్పారు. మరోవైపు నల్గొండ జిల్లాలో 12 స్థానాలకు 12 బీఅర్ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నల్గొండలో గులాబీ జెండా మళ్లీ రెపరెపలాడుతుందని జోస్యం చెప్పారు. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు. ప్రజలకు పైసా సేవ చేయలని ఈ రెండు పార్టీలు అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నాయని ఆయన అన్నారు.
'రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి చూసుకుంటే గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఇంటికిప్రతి వ్యక్తికి కేసీఆర్ ప్రభుత్వం చేసింది. ఒకవైపు సాగునీరు, ఇంకోవైపు విద్యుత్, మరోవైపు పండిన పంటను కొనుగోలు చేయడం దేశంలో ఏ రాష్ట్రం కూడా అమలు చేయడం లేదు. ఎస్‌ఓఆర్‌లో కానీ, జీఎస్డీపీలో కానీ దేశంలో ముందంజలో ఉన్న రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రంలో ప్రభుత్వాధికారులు పొందుతున్నంత జీతాలు వేరే ఏ రాష్ట్రంలో పొందడం లేదు. ఈ ఘనత కూడా కేసీఆర్‌కే దక్కుతుంది.' - గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనమండలి ఛైర్మన్.
రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ చేస్తున్న ప్రగతిని ప్రజలు పరిశీలిస్తున్నారని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే లక్షా 50 వేల మందికి ఉద్యోగాలు కల్పించామని, ఈ ఏడాదికి 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అంగన్ వాడీ, ఆశా కార్యకర్తలకు వేతనాలు తెలంగాణలోనే ఇస్తున్నామని చెప్పారు. కార్పొరేట్ తరహాలో వైద్యాన్ని అందించేందుకు పేదల కోసం సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వాస్పత్రులను కట్టిస్తున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్‌దేనని కొనియాడారు. తెలంగాణలో అమలవుతున్నన్ని పథకాలు ఏ రాష్ట్రంలో అమలుకావడం లేదని అన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు పెరిగేందుకు ఐటీశాఖ మంత్రి విదేశీ కంపెనీల నుంచి పెట్టుబడులు తీసుకువచ్చారని వివరించారు.
ఇవీ చదవండి: