నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ జలాశయానికి 64 వేల 548 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువన ఉన్న జలాశయాలు పూర్తిగా నిండటంతో శ్రీశైలం డ్యామ్‌కు వరద పోటెత్తుతోంది. శ్రీశైలంలో విద్యుదుత్పత్తి కొనసాగుతుండటంతో భారీ ఎత్తున వరద సాగర్‌కు చేరుతోంది. గత ఆరు రోజుల్లో 12 టీఎంసీల వరద నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 541.10 అడుగుల వద్దకు చేరింది. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312.04 టీఎంసీలకు గాను... 190.41 టీఎంసీలుగా ఉంది. ప్రస్తుతం సాగర్ నుంచి 1000 క్యూసెక్కుల నీటిని మాత్రమే దిగువకు వదులుతున్నారు.
వచ్చిన నీరు వచ్చినట్లుగానే...
పులిచింతలకు 5 వేల 600 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా... అంతే మొత్తంలో ఔట్ ఫ్లో ఉంది. 45.77 టీఎంసీల పూర్తిస్థాయి నీటి సామర్థ్యానికి గాను... 43.49 టీఎంసీలకు చేరుకుంది. మూసీ ప్రాజెక్టుకు స్వల్పస్థాయిలో 2,357 క్యూసెక్కుల వరద వస్తుండగా... 862 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 4.46 టీఎంసీల నీటి సామర్థ్యానికి గాను... 2.90 టీఎంసీల మేర నిల్వ ఉంది.
ఆనందంలో అన్నదాతలు
గతేడాది జులైలో కూడా సాగర్ నీటి మట్టం 540 అడుగులుగా ఉంది. సాగర్ జలాశయానికి వరద నీరు పెరగడంతో.. ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆయకట్టు పరిధిలో బోర్లు, బావులు ఉన్న రైతులు వరి నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఇదీ చదవండి: Data demand: అంతా ఆన్‌లైన్‌మయం.. పెరిగిన డేటా వినియోగం.!