Special Story on Villages in Nalgonda District: పుట్టిన ఊరంటే అదో అనిర్వచనీయ అనుభూతి. మమతలు పంచుతూ ప్రేమలు నింపుతూ.. జ్ఞాపకాలు నెమరువేస్తూ.. అడుగడుగునా పెనవేసుకునే అనురాగాలకు నిలయం. ప్రతి మనిషికి కన్నతల్లితో ఎంతటి అనుబంధం ఉంటుందో.. అంతే బంధం పుట్టిన మట్టితో పెనవేసుకుని ఉంటుంది. కారణాలు ఏవైనా బలగాన్ని వదిలేసి, ప్రేమానురాగాలు దూరం చేసుకుంటూ ఊరిని వదిలేయడమంటే ఎవరికైనా గుండె పగులుతుంది. అదే ఊళ్లకు ఊళ్లే ఖాళీ చేయాల్సి వస్తే ఆవేదన వర్ణణాతీతం. నల్గొండ జిల్లాలోనిర్మిస్తున్న రెండు జలాశయాలతో ముంపు గ్రామాల ప్రజలు అలాంటి దయనీయ పరిస్థితుల్లోనే మనోవేదనతో తల్లడిల్లుతున్నారు.
భూ సేకరణ కింద ప్రభుత్వం రైతుల భూములు స్వాధీనం: డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నల్గొండ జిల్లాలో కిష్టరాయిన్‌పల్లి, శివన్నగూడెం జలాశయాలను ప్రభుత్వం నిర్మిస్తోంది. కిష్టరాయిన్‌పల్లి పరిధిలో లక్ష్మణాపురం, ఈదులగండి గ్రామాలు శివన్నగూడెం జలాశయంలో చర్లగూడెం, నర్సిరెడ్డిగూడెం, వెంకేపల్లి, వెంకేపల్లితండా ముంపునకు గురవుతున్నాయి. శివన్నగూడెం జలాశయంలో 562 గృహాలు, 809 కుటుంబాలు, కిష్టరాయిన్‌పల్లి ప్రాజెక్టులో 142 గృహాలు, 205 కుటుంబాలు, ఆశ్రయాన్ని కోల్పోతున్నాయి. భూ సేకరణ కింద ప్రభుత్వం రైతుల నుంచి భూములు స్వాధీనం చేసుకుంది. ఆ భూముల్లో యంత్రాలతో మట్టిని తోడి ఇప్పటికే ఆనకట్టల నిర్మాణం చేపట్టారు.
సర్వం కోల్పోవడంతో ప్రట్టణాలకు వలస: గత మూడేళ్లుగా ఆ ప్రాంత రైతులకు సాగుతో బంధం తెగిపోయింది. ముంపు గ్రామాల్లో ఉపాధి హామీ పనులు సైతం నిలిచిపోయాయి. చుట్టూ ఎత్తైనకొండలు.. కాలం లేకపోయినా తగ్గని భూగర్భజలాలు. కళకళలాడే పచ్చని పంట పొలాల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో కులం మతమనే భావన లేకుండా.. బండెడు బలగంతో గుండెల్లో గూడుకట్టుకున్న ప్రేమానురాగాలతో సాఫీగా సాగుతున్న ఇక్కడి ప్రజల జీవితాలు ఆ రెండు ప్రాజెక్టుల నిర్మాణంతో ఒక్కసారిగా మారిపోయాయి. సర్వం కోల్పోవడంతో గ్రామాల్లోని ప్రజలు పట్టణాలకు వలస బాటపట్టారు. నాడు పలువురికి పని కల్పించిన పదెకరాల హలధారి నేడు దిక్కులేక కూలీలుగా మారిపోయాడు.
గ్రామాల్లో 'బలగం' రీపీట్: దశాబ్దాలుగా సాగుపై ఆధారపడి దర్జాగా బతికిన పిల్లలు నేడు ఉపాధి కరవై సమీప గ్రామాలకు కూలీ పనులకు వెళుతున్నారు. మరికొందరు ఆటో డ్రైవర్లుగా, గృహ నిర్మాణ కార్మికులుగా బతుకులు కొనసాగుతున్నారు. దశాబ్దాల తరబడిగా పచ్చగా కళకళలాడిన ఊళ్లలో దయనీయ పరిస్థితులను తడారిన కళ్లతో వీక్షిస్తున్న పండుటాకుల హృదయం రోదిస్తోంది. గ్రామంలో ఏ ఒక్క వృద్ధుడిని కదిలించినా.. ఓ ‘'బలగం' చిత్రమే కనిపిస్తుంది.
దశాబ్ధాలుగా పుట్టిన మట్టితో పెనవేసుకున్న బంధాలను వీడి తపిస్తున్న తమ జీవితదనంతరం వారి అంత్యక్రియలు నిర్వహించే ప్రాంతం తెలియక, స్వర్గం అందేనా.. మా పిండం కాకులు ముట్టేనా అంటూ వయసుడిగిన ఆ పండుటాకులు పడుతున్న బాధ వర్ణనాతీతంగా మారింది. భూములు తీసుకున్న ప్రభుత్వం పరిహారం కింద ఎకరానికి రూ.4 లక్షలు ఇవ్వగా.. అది దశల వారీగా ఇస్తూ వచ్చింది. వచ్చిన పరిహారం ఫలహారంలా కరిగిపోయింది తప్పితే మరో చోట భూమి కొందామన్నా సరిపోలేదని బాధితులు వాపోతున్నారు. పునరావాసం కింద కనీసం గ్రామాలను నిర్మించినా ఇక్కడే బతికేందుకు అవకాశం ఉండేదని బాధితులు వాపోతున్నారు.
ఇవీ చదవండి: