BJP Leaders Campaign in Munugode Bypoll: భాజపా ముఖ్యనేతలంతా మునుగోడు చుట్టేసి ఎన్నికల ప్రచారంలో పూర్తిగా నిమగ్నమయ్యారు. చండూరు మండలం బంగారిగడ్డలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు చేశారు. భారతదేశం చరిత్రలో ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్ తన మంత్రులు, ఎమ్మెల్యేలు గొర్లమందపై తోడేళ్లు దాడి చేసినట్లు.. తెలంగాణ ప్రజలను గాలికొదిలేసి, ప్రజా సమస్యలు పట్టించుకోకుండా మునుగోడుపై పడ్డారని ధ్వజమెత్తారు.
"భారతదేశం చరిత్రలో ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్ తన మంత్రులు, ఎమ్మెల్యేలు గొర్లమందపై తోడేళ్లు దాడి చేసినట్లు.. తెలంగాణ ప్రజలను గాలికొదిలేసి, ప్రజా సమస్యలు పట్టించుకోకుండా మునుగోడుపై పడ్డారు. ఈ రోజు తెరాస నాయకులు వ్యక్తిగత స్వేచ్ఛ హరిస్తునారు. కేసీఆర్‌కు ఓట్లపై ఉన్న ప్రేమ ప్రజలపై లేదు. ప్రజలపై ఉన్న ప్రేమతో సమస్యలు కేసీఆర్ ఎప్పుడూ పరిష్కరించరు" .-ఈటల రాజేందర్, భాజపా ఎమ్మెల్యే
మరోవైపు చండూరు మండలంలో ప్రచారంలో పాల్గొన్న భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.. మోటార్లకు మీటర్లు పెట్టే ప్రభుత్వం భాజపా కాదని.. కేసీఆర్ లాంటి అవినీతి నాయకులకు మీటర్లు పెట్టే పార్టీ భాజపా అని అన్నారు. మునుగోడు ఉపఎన్నిక వైపు ప్రపంచం మొత్తం చూస్తోందని.. తెరాస, కాంగ్రెస్ పార్టీలు కాంట్రాక్టులకు అమ్ముడుపోయారని ఆమె విమర్శించారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను రెండు సార్లు గెలిపిస్తే ఏం అభివృద్ధి చేయలేదని ఆమె ఆరోపించారు.
డబుల్ బెడ్‌రూం ఇల్లు.. ఇంటికో ఉద్యోగం, రైతు రుణమాఫీ అంటూ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని.. సొంత స్థలం ఉన్న వారికి రూ.ఐదు లక్షలు ఇస్తామన్న మాట మరిచిపోయారని ఆమె విమర్శించారు. మనం కట్టే పన్నుల ద్వారా, మద్యం ద్వారా వచ్చే రాబడితో ఇస్తున్న రూ.2 వేల పింఛన్ ఇస్తున్నారు. ఇది తెలియక మన అమ్మలు కేసీఆర్ పెద్ద కొడుకు అంటున్నారని ఆమె అన్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు పదో తేదీ వరకు జీతాలు పడటం లేదని.. కేసీఆర్‌కు ఓటేయకుంటే పింఛన్, రైతు బంధు రాదని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. కేసీఆర్ ఇచ్చిన బతుకమ్మ చీర కట్టుకుని తన బిడ్డ బతుకమ్మ ఆడుతుందా అని ప్రశ్నించారు. తెలంగాణ తెచ్చుకొంది బతుకమ్మ చీరల కోసమేనా.. కవితమ్మ రాక ముందు బతుకమ్మ ఆడలేదా అని ఆమె దుయ్యబట్టారు. కేసీఆర్ అవినీతి ద్వారా సంపాదించిన డబ్బుతో సొంత విమానాలు కొంటున్నారని దుయ్యబట్టారు. ఈ ఎన్నికల్లో ప్రజలందరూ భాజపాకు ఓటు వేసి గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి: