Enquiry on Plane Crash incident at Ramannagudem : నల్గొండ జిల్లాలో శిక్షణ విమానం కూలిన ఘటనపై కేంద్ర బృందం... దర్యాప్తు ప్రారంభించింది. ఘటన జరిగిన పెద్దవూర మండలం రామన్నగూడెం తండాకు దిల్లీ నుంచి డీజీసీఏ సాంకేతిక బృందం, ఎయిర్ క్రాఫ్ట్ ఆక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో సభ్యులు నలుగురు కలిసి ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. కుప్పకూలిన విమాన శకలాల నమూనాలు సేకరిస్తున్నారు. ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
ఘటనా స్థలంలో పటిష్ఠ భద్రత
ఘటన జరిగిన ప్రాంతంలో మిర్యాలగూడ డీఎస్పీ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. రామన్నగూడెం తండా వద్ద శనివారం శిక్షణ విమానం కూలి... మహిళా పైలెట్ మహిమా గజరాజ్ మృతిచెందారు. నాగార్జున సాగర్ విజయపురి సౌత్‌లో ఉన్న ఫ్లైటెక్ ఏవియేషన్ ప్రైవేటు అకాడమీకి చెందిన రెండు సీట్ల విమానం కుప్పకూలి... ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
త్వరలోనే కారణాలు
ప్రమాదం జరిగిన ప్రాంతంలో విద్యుత్ హైటెన్షన్ లైన్ ఉండడం వల్ల పవర్ గ్రిడ్ అధికారులు కూడా ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. దిల్లీ నుంచి వచ్చిన డీజీసీఏ బృందం సభ్యులు ఏఏఐబీ సభ్యులు ప్రమాదానికి కారణం అయిన సెస్న-152 చాపర్ నమూనాలను సేకరించి పరీక్షల కోసం తీసుకుకెళ్లారు. తర్వాత అక్కడ ఉన్న చాపర్ విడి భాగాలను విజయ పూరి సౌత్ లొంజ్ ఫ్లై టెక్ ఏవియేషన్ అకాడమీకి తరలించిన అధికారులు... సేకరించిన నమూనాల ద్వారా ప్రమాద ఘటనకు కారణాలు త్వరలోనే తెలుస్తాయని తెలిపారు. దీనిపై పోలీసు శాఖ, పౌర విమానయాన శాఖ, విద్యుత్ శాఖలు దర్యాప్తు చేస్తున్నాయని మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు.
'శనివారం నాడు ఫ్లైటెక్ ఏవిషన్కు సంబంధించిన మినీ ఫ్లైట్ ఒకటి క్రాష్ అయింది. ఒక శిక్షణలో ఉన్న పైలట్ చనిపోయారు. దానిపై విచారణ జరపడానికి డీజీసీఏ బృందం వచ్చింది. డీజీసీఏ సాంకేతిక బృందం, ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో సభ్యులు ఆరా తీస్తున్నారు. చాపర్ శకలాలన్నింటిని తీసుకెళ్తున్నారు. వాటిని పరిశీలించిన అనంతరం ఘటనకు సంబంధించిన కారణాలను వివరిస్తారు. వాళ్లు ఆ తర్వాత రిపోర్టు ఇస్తామన్నారు. అనంతరం ఫైనల్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది.'
-వెంకటేశ్వరరావు, మిర్యాలగూడ డీఎస్పీ
ఏం జరిగింది?
Nalgonda Plane Crash : నల్గొండ జిల్లాలో శిక్షణ విమానం కూలి పైలట్ దుర్మరణం చెందారు. తమిళనాడుకు చెందిన గజరాజ్ కుమార్తె మహిమ.. నాగార్జునసాగర్ సమీపంలోని విజయపురి సౌత్ ఏవియేషన్ అకాడమీలో పైలట్‌గా శిక్షణ పొందుతున్నారు. ఇందులో భాగంగా.. శిక్షణ విమానం 'సెస్నా-152' డబుల్ సీటర్‌లో శనివారం ఉదయం పదిన్నర గంటలకు బయలుదేరారు. ఈ క్రమంలోనే పెదవూర మండలం రామన్నగూడెం తండా వద్దకు రాగానే.. విమానం అదుపుతప్పి వ్యవసాయ పొలాల్లో కుప్పకూలింది. భారీ శబ్దంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. విమానం ముక్కలు కాగా.. మహిమ మృతదేహం పూర్తిగా ఛిద్రమైంది.
ఇదీ చదవండి: 'లైంగికంగా వేధిస్తున్నాడని మైనర్ ఫిర్యాదు.. ప్రజాప్రతినిధిపై కేసు'