ప్రజలందరికీ ప్రభుత్వమే ఉచితంగా కరోనా పరీక్షలు చేయించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సుమారు 60 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని... గ్రామీణ ప్రాంతాల్లోనూ కొవిడ్ వ్యాపించటం పట్ల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని తెలిపారు.
కరోనాతో రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతుంటే సీఎం కేసీఆర్ మాత్రం ఫామ్‌హౌస్‌లో కూర్చొని సెక్రటేరియట్ భవనాలను కూల్చివేయిస్తున్నారని... కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని మండిపడ్డారు. వాస్తు బాగోలేదనే సాకుతో ఆదాయం లేని ఈ పరిస్థితుల్లో భవనాలను కూల్చివేయడం తగదన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఇకనైనా ప్రభుత్వం వెంటనే స్పందించి అందరికీ కరోనా వైద్య పరీక్షలు చేయించి, పాజిటివ్ వచ్చినవారికి సరైన వైద్యం అందించాలని రంగారెడ్డి డిమాండ్ చేశారు.