ఉమ్మడి నల్గొండ జిల్లాలో హోల్‌సేల్ ధరలు ఒకే మాదిరిగా ఉన్నా.. నిత్యావసర సరకులు, కూరగాయల ధరలు ఒక్కోచోట ఒక్కో రకంగా ఉన్నాయి. చిల్లర వర్తకులు 10 నుంచి 20 శాతం ధరలు పెంచుతూ సామాన్యులపై భారం మోపుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో కిరాణా, హోల్‌సేల్ వ్యాపారుల ధరల మధ్య వ్యత్యాసం భారీగా ఉంది. నల్గొండ, సూర్యాపేట, మిర్యాలగూడల్లోనూ ధరలు పెరిగాయి. లాక్‌డౌన్‌కు ముందు, ప్రస్తుత ధరలు పోల్చుకుంటే దాదాపు 10 నుంచి 20 శాతం పెరిగాయి.
సన్నరకం బియ్యం క్వింటాకు రూ.200 నుంచి రూ.300 వరకు పెంచారు. పలుచోట్ల కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనే ఆరోపణలున్నాయి.కరోనా ఆంక్షల కారణంగా ధరల పెరుగుదల విపరీతంగా ఉంది. రైతుబజార్.. బహిరంగ మార్కెట్ ధరలకు భారీ వ్యత్యాసమే కనిపిస్తుంది. ప్రధానంగా ప్రతిరోజూ వినియోగించే పచ్చిమిరి, టమాటా ధరలు దాదాపు మూడురెట్లు పెరిగాయి.
ప్రతి కుటుంబంపై భారమే
నలుగురు సభ్యులున్న కుటుంబం గతంలో నిత్యావసర సరకులు, ఇతర అవసరాలకు నెలకు రూ.4వేలతో అతిసామాన్య జీవనం గడిపితే ప్రస్తుతం దాదాపు రూ.5వేల వరకు పెరిగింది. నెలకు రూ.10వేల వరకు వేతనం వచ్చే వారికి ఇప్పుడు రూ.5వేల నుంచి రూ.6వేలు మాత్రమే దక్కుతుండగా ధరల పెరుగుదల ప్రభావం గోరుచుట్టుపై రోకలి పోటులా మారింది.
పెరిగిన ధరలన్నీ కలుపుకుంటే ఒక కుటుంబంపై వెయ్యి నుంచి రూ.2వేల వరకు అదనపు భారం పడింది. లాక్‌డౌన్ ప్రారంభం నుంచే అల్పాదాయ వర్గాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవడంతో కొంత ఉపశమనం కలిగింది. మధ్యతరగతి వారు అటు ఉపాధి కోల్పోయి.. వేతనంలో కోతతో అప్పులబారిన పడ్డారు.
అధిక ధరలకు విక్రయిస్తే చర్యలే
నిత్యావసర సరకుల ధరలు పెంచకుండా నిఘా పెట్టాం. లాక్‌డౌన్ సమయంలో వ్యాపారులతో వారంవారం సమీక్షించాం. మండల, జిల్లాస్థాయిలో అధికారులతో పర్యవేక్షణకు కమిటీ వేశాం. అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. ప్రతి దుకాణంలో ధరల పట్టిక ఏర్పాటు చేయాలి.
- రమేశ్, అదనపు కలెక్టర్, యాదాద్రి భువనగిరి
మాదాసు సుదర్శన్ భువనగిరిలో చిన్న క్లాత్ స్టోర్ నిర్వహిస్తున్నాడు. నలుగురు కుటుంబసభ్యులు. అంతా బాగున్న రోజుల్లోనే నెలకు రూ.10వేల నుంచి రూ.15 వేల వరకు సంపాదించేవాడు. లాక్‌డౌన్‌తో దుకాణం మూతపడింది. కుటుంబ పోషణకు అప్పుచేసి కొంతకాలం జీవనం సాగించాడు. లాక్‌డౌన్ సడలింపులతో దుకాణం తెరిచినా వ్యాపారాలు లేవు. రోజుకు రూ.100 కూడా రాని పరిస్థితి. పెరిగిన ధరలతో ఆయన కుటుంబంపై భారం పడింది.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కరోనా విలయతాండవం... 20వేలు దాటిన కేసుల సంఖ్య