ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరోనా కేసులు ప్రజల ఆందోళనను రెట్టింపు చేస్తున్నాయి. ప్రతిరోజూ పాజిటివ్ కేసులు బయటపడుతున్నా.. వాటిని జిల్లాల లెక్కల్లో చేర్చడంలో అయోమయం నెలకొంది. నల్గొండ జిల్లాలో ఆరుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా.. అందులో మిర్యాలగూడకు చెందిన ఇద్దరు, దేవరకొండ, కేతేపల్లి, నిడమనూరులలో ఒక్కొక్కరు, నల్గొండ 12వ బెటాలియన్లో ఒక కానిస్టేబుల్కు వైరస్ సోకింది.
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆరు కరోనా కేసులు వెలుగు చూడగా.. అందులో నలుగురు నల్గొండ జిల్లా వాసులున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. చింతపల్లికి మండలానికి చెందిన మహిళ ఇప్పటికే కరోనా చికిత్స పొందుతూ హైదరాబాద్ ఆస్పత్రిలో మరణించింది. ఈ కేసులు యాదాద్రి భువనగిరి జిల్లాలో కలపాలా? నల్గొండ జిల్లాలో కలపాలా? అని అధికారులు ఆలోచనలో పడ్డారు.