నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోని కొత్త ఎత్తిపోతలు, పాతవాటికి మరమ్మతులతో రైతులకు ప్రయోజనం కలగనుంది. పథకాల్ని ఏడాదిన్నరలోపు పూర్తి చేయకపోతే తన పదవికి రాజీనామా చేస్తానని నాగార్జునసాగర్ ఉప ఎన్నిక సందర్భంగా... మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. సకాలంలో పూర్తి చేయలేనట్లయితే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోమని సీఎం సైతం... హాలియా సభలో అన్నారు. ఇటీవల సీఎం ఇదే విషయమై సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే పరిపాలనపరమైన అనుమతుల కోసం ఈఎన్సీకి దస్త్రం పంపగా... అవి రాగానే సాంకేతికపరమైన అనుమతులు పూర్తి చేసి ఈనెల 15 తర్వాత టెండర్లు పిలిచేందుకు నీటిపారుదల అధికారులు సన్నద్ధమవుతున్నారు.
10 రెట్లు పెరిగిన అంచనాలు
గత ఫిబ్రవరి 10న శంకుస్థాపన చేసిన నెల్లికల్ ఎత్తిపోతల పథకం అంచనాలు 10 రెట్లు పెరిగాయి. గతంలో ఉన్న 4,400 ఎకరాల ఆయకట్టుకు గాను ఒక ఏజెన్సీకి టెండర్లు అప్పగించారు. వాటిని ఇప్పుడు రద్దు చేసి పరిధిని 24,886 ఎకరాలకు పెంచారు. రూ.78 కోట్లున్న అంచనాలు రూ.703 కోట్లకు పెంచారు. రోజుకు 370 క్యూసెక్కుల చొప్పున 3.8 టీఎంసీల నీటిని తరలించే ప్రక్రియకు టెండర్లు ఆహ్వానిస్తారు.
రెండు పంపులు
సాగర్ వెనుక జలాల వద్ద రెండు పంపులు అమర్చుతారు. ఒక పంపు నెల్లికల్ వద్ద, మరో పంపు సుంకిశాలతండా వద్ద ఏర్పాటు చేసి నీటిని పంపు చేస్తారు. నెల్లికల్ పాయింట్ వద్ద గల ప్రెజర్ మెయిన్-1 నుంచి నెల్లికల్, తిమ్మాయిపాలెం, చింతలపాలెం గ్రామపంచాయతీలతోపాటు వాటి పరిధిలోని అనుబంధ పల్లెల్లో 15,499 ఎకరాలకు నీరు చేరుతుంది. సుంకిశాలతండా వద్ద గల ప్రెజర్ మెయిన్-2 పంపు ద్వారా సుంకిశాల, తునికినూతల, ఎల్లాపురం గ్రామ పంచాయతీలు అనుబంధ తండాల పరిధిలోని 9,387 ఎకరాలకు నీరందుతుంది. దీనికితోడు రాజవరం చివరి భూములకు నెల్లికల్ ద్వారా 4,175 ఎకరాలకు నీటిని తరలిస్తారు.
చివరి ఆయకట్టకు అందని నీరు
సాగర్ ఎడమ కాల్వ పరిధిలో 0 కిలోమీటరు నుంచి 134.5 కిలోమీటరు వరకు 42 ఎత్తిపోతల పథకాలు పని చేస్తుండగా 92 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందుతోంది. ఇంకో 10 పథకాలు వివిధ దశల్లో నిర్మాణాలు సాగుతున్నాయి. 817 కోట్లతో చేపట్టే ముక్త్యాల బ్రాంచి కెనాల్ ద్వారా 55 వేల ఎకరాలు, 118.70 కోట్లతో మొదలుపెట్టే జాన్ పహాడ్ మేజర్ కింద 11 వేల ఎకరాల ఆయకట్టు ఉన్నా ఇప్పటిదాకా చివరి దశ భూములకు నీరందడం లేదు.
లైనింగ్ చెడిపోవడం వల్ల సగం ఆయకట్టు కూడా నీటికి నోచుకోవడం లేదు. కాల్వ కట్ట పటిష్ఠంగా లేకపోవడంతో పూర్తిస్థాయిలో నీరు విడుదల చేస్తే ప్రమాదం తలెత్తే ఆస్కారముంది. అందుకే దాన్ని ఆధునికీకరించాలని చూస్తున్నారు. ఇక జాన్ పహాడ్ మేజర్ కాల్వ నేరేడుచర్ల వద్ద మొదలై జాన్ పహాడ్ వరకు కొనసాగుతుంది. ఈ కాల్వను ఆధునికీకరిస్తే పాత ఆయకట్టుతోపాటు స్థిరీకరణలో లేని వాటికి కూడా నీరందించవచ్చు.
నల్గొండ జిల్లాలో నెల్లికల్ మినహా మిగతా పథకాల ఆయకట్టు, అంచనాలు యథాతథంగా ఉన్నాయి. దేవరకొండ నియోజకవర్గంలోని కంబాలపల్లి, అంబాభవాని, పొగిళ్ల, పెద్దగట్టు, అంగడిపేట, సాగర్ సెగ్మెంట్లోని కుంకుడు చెట్టు, మిర్యాలగూడ పరిధిలోని బాలెంపల్లి, కేశవాపురం, వాడపల్లి పథకాల్లో ఎలాంటి మార్పులు లేవు. అటు సూర్యాపేట జిల్లాలోని ముక్త్యాల బ్రాంచి కెనాల్, జాన్ పహాడ్, ఆర్ 9 పథకాలు ఇంతకుముందు మాదిరిగానే యథాతథంగా ఉండనున్నాయి. నల్గొండ జిల్లాలోని పథకాలకు రూ.1,600 కోట్ల నుంచి రూ.1,700 కోట్ల వరకు అవుతాయని అధికారులు చెబుతున్నారు.