మునుగోడు ఉపఎన్నిక ప్రచారం ముగిసే సమయంలో... పలివెల గ్రామంలో తెరాస, భాజపా కార్యకర్తలు ఘర్షణకు దిగారు. రెండు పార్టీల కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. తెరాస, భాజపా ప్రచారం నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. రాళ్లు, కర్రలు, పిడిగుద్దులతో ఇరు పార్టీల శ్రేణులు పరస్పరం దాడులు చేసుకున్నాయి. భాజపా ప్రచార కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్‌పైనా రాళ్ల దాడి జరిగింది. నేతలకు రక్షణగా వచ్చిన గన్‌మెన్లు కూడా గాయపడ్డారు. పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను చెదరగొట్టారు.
వ్యూహం ప్రకారమే ఈటల, ఆయన భార్యపై తెరాస శ్రేణులు దాడికి దిగాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. గొడవ జరగవద్దనే ఉద్దేశంతో... ఈటల సంయమనం పాటించారని పేర్కొన్నారు. తన సతీమణి స్వగ్రామమైన పలివెలలో ఉండగా.. తెరాస శ్రేణులు దాడికి దిగాయని ఈటల రాజేందర్ తెలిపారు. ఈ దాడిలో తన గన్‌మెన్లు, పీఏ సహా 20 మందికిపైగా గాయాయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెరాస దాడులకు భయపడబోమని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.
భాజపా ఆరోపణలను తెరాస ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఖండించారు. ఆ పార్టీ కార్యకర్తలే దాడులకు పాల్పడ్డారని విమర్శించారు. ఎన్నికల వేళ దాడులు చేసే సంస్కృతి తెరాసకు లేదని స్పష్టం చేశారు. పలివెలలో ఘర్షణకు మీరంటే మీరే కారణమని భాజపా, తెరాస నేతలు ఆరోపణలకు దిగారు.
ఇవీ చదవండి: