రాష్ట్రానికి 2.40 లక్షల కిట్లను కేంద్ర ప్రభుత్వం పంపించిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. అవసరమైన ఔషధాలు, పీపీఈ కిట్లను కేంద్రం పంపిస్తోందని పేర్కొన్నారు. ఇప్పటికే 880 వెంటిలేటర్లను రాష్ట్రానికి తరలించామన్నారు. మరో 1200 వెంటిలేటర్లను అందించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోందన్నారు. 2 లక్షలకు పైగా ఆర్టీపీసీఆర్ టెస్టు కిట్లు కేంద్రం నుంచి వచ్చాయని వివరించారు. ఆస్పత్రుల్లో కొవిడ్ చికిత్స ఏర్పాట్ల కోసం రూ.200 కోట్లు ఇచ్చామని స్పష్టం చేశారు. లాక్‌డౌన్, కంటైన్‌మెంట్ జోన్ల విషయంలో రాష్ట్రాలకు కేంద్రం పూర్తి స్వేచ్ఛను ఇచ్చిందన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే మైరుగైన చికిత్స అందించాలి..
కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కిషన్‌రెడ్డి సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పరీక్షలను మరింత వేగవంతం చేయాలన్నారు. వైరస్ చికిత్స విధానంతో ఆస్పత్రులపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులపై విశ్వాసం లేక చాలామంది ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తున్నారని ఉదహరించారు. కరోనా బాధితులు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి లక్షలు బిల్లు చెల్లించుకోవాల్సిన దుస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే మెరుగైన చికిత్స అందించి ప్రజల్లో నమ్మకం కలిగించాలని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : ఎస్ఆర్ఎస్పీ వరదకాల్వ ఎగువన నీటి ఇబ్బందులపై సీఎం సమీక్ష