munugode by election: అసెంబ్లీ ఎన్నికల ముందు జరుగుతున్న మునుగోడు ఉపఎన్నికలో గెలవాలనే లక్ష్యంతో ప్రధాన పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవాలనే పట్టుదలతో కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. గాంధీభవన్‌లో మునుగోడు వ్యూహంపై మూడు గంటలకుపైగా కాంగ్రెస్ సమావేశం నిర్వహించింది. మహిళా అభ్యర్థికి అవకాశమిచ్చామన్న విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు.
నమ్మకానికి, అమ్మకానికి మధ్య జరుగుతున్న యుద్ధం: నమ్మకానికి, అమ్మకానికి మధ్య జరుగుతున్న యుద్ధమంటూ బలంగా జనంలోకి తీసుకెళ్లాలని తీర్మానించారు. ఈ నెల 11న తొలిసారి పాల్వాయి స్రవంతి నామినేషన్ వేయాలని 14న భారీ జనసమీకరణతో మరో సారి నామపత్రాలు దాఖలు చేయాలని నిర్ణయించారు. 9 నుంచి 14 వరకు రేవంత్‌తో సహా ఇన్‌ఛార్జ్ నేతలంతా అక్కడే మకాం వేయాలని నేతలు స్పష్టం చేశారు. సమీక్షా సమావేశంలో నియోజకవర్గంలో ప్రచార సరళిపై చర్చించామని రెండు రోజుల్లో మరో సమీక్ష ఉంటుందని పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి తెలిపారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రచారంలో పాల్గొంటారని ఆమె పేర్కొన్నారు.
భాజపా వ్యూహాలు: అటు భాజపా సైతం ఈ నెల 8న మునుగోడులో ఉప ఎన్నిక సన్నాహక సమావేశాన్ని నిర్వహించనుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన జరిగే ఈ భేటీకి ఉప ఎన్నిక స్టీరింగ్ కమిటీ, మండల ఇన్‌ఛార్జీలు సహా ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యులు హాజరుకానున్నారు. సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ పాల్గొని ఉప ఎన్నికపై చర్చిస్తారు. మునుగోడు ఉప ఎన్నికను సక్రమంగా నిర్వహించాలని.. కేంద్ర బలగాల పర్యవేక్షణలో జరపాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ను భాజపా ప్రతినిధుల బృందం కోరింది.
'కేసీఆర్.. బీసీలకు టికెట్ ఇవ్వాలి': డబ్బు మద్యంతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి గెలువాలని తెరాస ప్రయత్నిస్తోందని నల్లు ఇంద్రాసేనా రెడ్డి ఆరోపించారు. మునుగోడులో తెరాస పార్టీ బీసీ అభ్యర్థికే టికేట్ కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. తెరాస పార్టీ జాతీయ పార్టీగా మొదటి టికెట్ బీసీలకు ఇచ్చి కేసీఆర్ చిత్తశుద్దిని నిరూపించుకోవాలని సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లో డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: