నల్గొండ జిల్లా మిర్యాలగూడలో దళారీ వ్యవస్థ రద్దు చేయాలంటూ మత్స్యకారులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ మిర్యాలగూడ మత్స్యకార సొసైటీ సభ్యులు కొంత మంది చెరువులోకి దిగి నిరసన వ్యక్తం చేశారు.
4 చెరువుల పరిధిలో..
మిర్యాలగూడ మత్స్యకార సొసైటీ కింద మొత్తం నాలుగు చెరువులున్నాయి. యాద్గార్ పల్లి చెరువు, హౌసింగ్ బోర్డు చెరువు, శ్రీనివాస్ నగర్ చెరువు, చింతపల్లి చెరువులకు కలిపి మిర్యాలగూడ పరిధిలో సుమారు 250 మంది సభ్యులు ఉన్నారు. ఇప్పుడు 100 మంది మాత్రమే కొనసాగుతున్నారు. ఇందులో 150 మంది చనిపోగా.. ఆయా స్థానాల్లో వారి వారసులు కొనసాగుతున్నారు. అర్హత ఉన్న మత్స్యకారులను మాత్రం గత 15 ఏళ్లుగా సభ్యులుగా నియమించలేదు. మత్స్యకార సోసైటీలో నెలకొన్న రెండు వర్గాల విభేదాల కారణంగానే తరచూ.. చేపల చెరువుకు సంబంధించి తగాదాలు ఉత్పన్నమవుతున్నాయని సొసైటీ సభ్యులు పేర్కొన్నారు.
సుమారు రూ.2 కోట్లకు లెక్కలేదు !
మిర్యాలగూడ మత్స్యకార సంఘంలో ప్రస్తుతం ఉన్న కార్యావర్గం దాదాపు రూ. 2 కోట్ల మేర సొమ్ముకు లెక్కలు చూపలేదు. సొసైటీ రెండు వర్గాలుగా చీలిపోయింది. కాంట్రాక్టర్ ఉపేందర్ రెడ్డికి అనుకూల వర్గం...మరొకటి వ్యతిరేక వర్గం. ఈ మేరకు వ్యతిరేక వర్గం సభ్యులు మత్స్యశాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. విచారణ నివేదిక ప్రకారం కమిషనర్ సొసైటీని రద్దు చేశారు. ఫలితంగా రద్దును వ్యతిరేకిస్తూ... కోర్టు నుంచి కాంట్రాక్టర్‌కు అనుకూల వర్గం సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు స్టే తెచ్చుకున్నారు. కాంట్రాక్టర్ ప్రోద్బలంతో ఈ నెల 2న శ్రీనివాస్ నగర్ చెరువులో అక్రమంగా మూడు ట్రాక్టర్ల చేపలు పట్టి తూకం వేస్తుండగా కొంతమంది సభ్యులు అడ్డుకున్నారు.
నిందితులపై ఫిర్యాదు..
అనంతరం నల్గొండ డీఎఫ్ఓకి ఫిర్యాదు చేసి సదరు కాంట్రాక్టర్ నుంచి రూ.2,36,000 ఎఫ్‌డీఓకు ఇప్పించి నిందితులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు చెరువులో అక్రమంగా చేపలు పట్టిన వారిపై మత్స్యశాఖ పరంగా కానీ ఠాణాలో కానీ కేసు నమోదు కాలేదని సభ్యులు వాపోతున్నారు. మత్స్యశాఖ తరఫున ఫిర్యాదు వస్తేనే స్వీకరిస్తామని పోలీసులు చెప్పడం పట్ల సోసైటీ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాంట్రాక్టర్ ఉపేందర్ రెడ్డి హల్చల్..
ఈ క్రమంలో చేపల చెరువు కాంట్రాక్టు తనదేనని.. ఇక్కడకి ఎవరూ రావద్దంటూ గాయం ఉపేందర్ రెడ్డి అక్కడికి వచ్చిన వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని సంఘం సభ్యులు ఆరోపిస్తున్నారు. చెరువు లూటీ అయిపోయిందని తెలిసి అక్కడికి వచ్చిన గ్రామస్థులను సైతం బెదిరిస్తున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు. చేపల చెరువు కాంట్రాక్టర్ తనను తుపాకితో బెదిరించాడని దుబ్బతండా సర్పంచ్ హరిబాబు మిర్యాలగూడ రూరల్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. చెరువుకు వచ్చే జనాలను బెదిరించడమే కాకుండా గాల్లోకి కాల్పులూ జరిపాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అవి ప్రాక్టీస్‌లో భాగంగానే...
వెంటనే ఉపేందర్ రెడ్డిపై తగిన చర్యలు తీసుకోవాలని సంఘ సభ్యులు కోరుతున్నారు. తుపాకీతో బెదిరించినట్లు ఫిర్యాదు వచ్చిందని పోలీసులు వెల్లడించారు. నిందితుడి వద్ద నుంచి పేల్చిన తూటాలను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ఆరు నెలలకోసారి ప్రాక్టీస్ నిమిత్తమై తన తోటలో పేల్చేవాడినని.. అలా ప్రాక్టీస్ చేసే అనుమతి తనకు ఉందని ఉపేందర్ రెడ్డి తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.