నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ ప్రాంత భూగర్భ జలాల్లో కొత్త బ్యాక్టీరియాను జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్‌జీఆర్‌ఐ) గుర్తించింది. కార్నీ బాక్టీరియాలో ఇది కొత్త ఉత్పరివర్తనమని పరిశోధకులు తెలిపారు. దీన్ని గుర్తించడం ఇదే మొదటిసారని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ధ్రువీకరించిందని పేర్కొన్నారు. నేషనల్ సెంటర్ ఫర్ బయో కెమిస్ట్రీ మార్గదర్శకాల ప్రకారం కొత్త వేరియంట్‌కు కేపీజె-22 పేరు ఖరారు చేసినట్లు చెప్పారు. ఈ కొత్త బ్యాక్టీరియా నీటిలోని ఫ్లోరైడ్ మోతాదును 500 పీపీఎంకు పెంచినా కూడా వృద్ధి చెందుతున్నట్లు గుర్తించామని... ఫలితంగా కొత్త బ్యాక్టీరియాలో బయోరిమిడియేషన్ లక్షణాలు ఉన్నాయనే నిర్ధారణకు వచ్చామని ఎన్‌జీఆర్‌ఐ సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ కుషాల్ పి సింగ్ తెలిపారు.
కలుషిత ప్రాంతాన్ని, కాలుష్య కారకాలను విచ్ఛిన్నం చేయడానికి సూక్ష్మజీవులను ఉపయోగించడాన్ని బయోరిమిడియేషన్ అంటారని... తాము గుర్తించిన బ్యాక్టీరియాతో భూగర్భ జలాల్లోని ఫ్లోరైడ్‌ను నానో సాంకేతికతతో శాశ్వతంగా తొలగించడానికి దోహదం చేస్తుందనే కోణంలో పరిశోధన కొనసాగిస్తున్నామని చెప్పారు. వియత్నాం, సింగపూర్ పరిశోధకులతో కలిసి దీన్ని కొనసాగిస్తామని ‘ఈనాడు’కు తెలిపారు.
ఆ నీరు తాగడానికి పనికిరాదు..: బయో రిమిడియేషన్‌కు దోహదం చేసే బ్యాక్టీరియా కోసం నల్గొండ జిల్లాలోని ఫ్లోరైడ్ ప్రభావిత 20 ప్రాంతాల నుంచి రెండు నెలల క్రితం సేకరించిన భూగర్భ నీటిలో ఫ్లోరైడ్ స్థాయి నిర్దేశించిన 1.5 పీపీఎం కంటే అధికంగా ఉంది. గ్రామపంచాయతీ సరఫరా చేసే బోరు నీరు, వ్యవసాయ పొలాల్లోని బోర్ల నుంచి నమూనాలను సేకరించారు. 2.5 పీపీఎం నుంచి గరిష్ఠంగా 11.5 పీపీఎం వరకు ఉందని ప్రాజెక్టు అసోసియేట్ జె.ఆర్.జోవిత తెలిపారు. ఈ నీళ్లు తాగడానికి పనికిరావని..నీటి, మట్టి నమూనాల సేకరణకు తాము గ్రామాలకు వెళ్లినప్పుడు ఇప్పటికీ కొన్ని చోట్ల కొందరు ఇవే నీటిని తాగుతున్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. మిషన్ భగీరథ నీళ్లు సరఫరా చేస్తున్నచోట భూగర్భ నీటివాడకం లేదన్నారు.
ఇవీ చూడండి..
నిండుకుండల్లా జలాశయాలు.. నాగార్జునసాగర్ 10 గేట్లు ఎత్తిన అధికారులు
భారీ స్కామ్.. రూ.56కోట్ల క్యాష్, రూ.14కోట్ల ఆభరణాలు స్వాధీనం.. లెక్కించేందుకు 13 గంటలు!