యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు సుందరయ్య కాలనీకి చెందిన లక్ష్మమ్మ దీనగాథ వింటే ఎవరి గుండెయినా బరువెక్కాల్సిందే. ముగ్గురు మగపిల్లలు, ఓ ఆడపిల్ల... ఆ ఇంట సంతానం. పిల్లలు చిన్నవయసులోనే భర్త దూరమవడంతో... కూలీకెళ్లి వారిని కనురెప్పలా సాకింది. ప్రయోజకులై చేతికందివచ్చిన సమయంలో.. విధి ఆ కుటుంబాన్ని వెక్కిరించింది. పెద్దకుమారుడికి కాలికైన గాయం కాస్త పెద్దదై... మంచానికే పరిమితమయ్యాడు. రెండో కుమారుడు వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకోగా.... మూడో కుమారుడు ఒత్తిడితో మతిస్థిమితం కోల్పొయాడు. ఇలా పిల్లలంతా తలో సమస్యతో బాధపడుతుంటే ఆ తల్లి వేదన వర్ణణాతీతం.
కుమారులను కంటికిరెప్పలా కాపాడేందుకు 65 ఏళ్ల వయసులోనూ ఆ మాతృమూర్తి జీవనపోరాటం చేస్తూనే ఉంది. అప్పటివరకు ఆ ఇంటికి ఆసరాగా ఉన్న తనయులిద్దరు అనారోగ్యం బారిన పడటం మరింత కుంగదీసింది. వారికి వైద్యం చేయించలేక... ఇల్లు వెళ్లదీయలేక లక్ష్మమ్మ పుట్టెడు బాధలుపడుతోంది. మనసున్న మారాజులెవరైనా ఆదుకోవాలని చేతులెత్తి వేడుకుంటోంది.
పెద్దకొడుకు వైద్యానికి నెలకు 3 వేలు ఖర్చవుతోంది. అందినకాడికి అప్పు తీసుకొచ్చి ఖర్చుచేసినప్పటికీ...ఆ తల్లికి తలకు మించిన భారంగా మారింది. అప్పులు చెల్లించలేక...వైద్యానికి డబ్బుల్లేక సాయం కోసం ఎదురుచూస్తోంది. కుమారులకు వైద్యం చేయించేందుకు ప్రభుత్వం చేయూతనివ్వాలని ఆ పేదతల్లి కోరుతోంది.
ఇదీ చూడండి: