రెండు రాష్ట్రాల వరప్రదాయిని అయిన నాగార్జునసాగర్ నుంచి... నీటి విడుదల కొనసాగుతోంది. 18 గేట్ల ద్వారా... లక్షా 67 వేల 153 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువ నుంచి వస్తున్న భారీ ప్రవాహాలకు తోడు, కృష్ణా పరివాహకంలో కురుస్తున్న వర్షాలతో... సాగర్‌కు 4 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చి చేరుతోంది. ఇవాళ ఉదయం నాలుగు గేట్లతో నీటి విడుదల ప్రారంభమవగా... రాత్రి వరకు 18 గేట్లకు చేరుకుంది. ఒక్కో గేటును ఐదడుగుల మేర ఎత్తి... నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. స్థానిక శాసనసభ్యుడు నోముల నర్సింహయ్య, సీఈ నర్సింహ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
నాగార్జునసాగర్ గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులు కాగా... ప్రస్తుతం 586 అడుగుల మేర నీరుంది. జలాశయ పూర్తిస్థాయి నీటి మట్టం 312.04 టీఎంసీలకు గాను... 3 వందల టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయానికి నాలుగు లక్షలకు పైగా క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది. ఆగస్టులో క్రస్టు గేట్ల ద్వారా నీటిని విడుదల చేయడం... వరుసగా ఇది రెండో ఏడాది కావడం విశేషం. గత పదకొండేళ్లలో... గతేడాది మాత్రమే ఆగస్టులో నీటిని విడుదల చేశారు. అటు టెయిల్ పాండ్ నుంచి సైతం లక్ష క్యూసెక్కుల నీటిని కిందకు పంపిస్తుండటం వల్ల... కృష్ణమ్మ పులిచింతలను తాకింది. 45.77 టీఎంసీల సామర్థ్యం గల పులిచింతల ప్రాజెక్టులో... 26.75 శతకోటి ఘనపుటడుగుల నీరుంది.
కొవిడ్ తీవ్రత దృష్ట్యా నాగార్జునసాగర్ కుడి, ఎడమ ప్రాంతాల్లో... ఇరు రాష్ట్రాల పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సందర్శకులు వచ్చే వీలు లేకుండా... రహదారులపై బారికేడ్లు ఉంచారు.