Inspire Manak: విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు కొత్త ప్రయోగాలు, ఆవిష్కరణల దిశగా వారిని ప్రోత్సహించి భావి శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు కేంద్ర ప్రభుత్వం ఇన్‌స్పైర్ మనక్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అన్ని యాజమాన్యాల పరిధిలోని ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6 నుంచి పదో తరగతి చదువుతున్న 2022-23 విద్యా సంవత్సరం విద్యార్థులు అర్హులు. సెప్టెంబరు 30 వరకు ఇన్‌స్పైర్ మనక్ నామినేషన్లు అందజేసేందుకు గడువుంది.
ఎంపికైన ప్రతి విద్యార్థికి రూ. 10 వేల పారితోషికం చెల్లిస్తారు. ప్రతి పాఠశాల నుంచి అయిదు నామినేషన్లు పంపేందుకు అవకాశం ఉంది. ప్రయోగానికి సంబంధించిన చిత్రాలు, వివరాలు, వీడియోలు, పాఠశాల యూ డైస్ నంబరు, ఈ-మెయిల్, విద్యార్థి ఆధార్ నంబరు, బ్యాంకు ఖాతా, గైడ్ ఉపాధ్యాయుడు, హెచ్‌ఎం చరవాణి నంబర్లు తదితర వివరాలతో ఆన్‌లైన్‌లో ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుంది.
మేథో సంపత్తి హక్కులు: విద్యార్థులు పంపిన ప్రాజెక్టులను డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీకి చెందిన కేంద్ర మంత్రిత్వ శాఖప్రతినిధులు పరిశీలిస్తారు. ఎంపికైన విద్యార్థులకు రూ. 10 వేలు అందజేస్తారు. జాతీయ స్థాయికి ఎంపికైతే రూ. 25 వేలు, జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాజెక్టుగా ఎంపికైతే రూ. 40 నుంచి రూ. 60 వేలు నగదు పారితోషికాన్ని ఇస్తారు. ఉత్తమంగా ఎంపికైన పరిశోధనపై మేధో సంపత్తి హక్కులు కల్పిస్తారు. విజేతలకు రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం అందజేస్తారు. ప్రతిభావంతులకు ఐఐటీ ప్రవేశాల్లో రిజర్వేషన్ వర్తింపజేస్తారు.
శరీర ఉష్ణోగ్రత గుర్తించే కార్డు.. నాగర్‌కర్నూల్ మండలం గగ్గలపల్లి జడ్పీహెచ్‌ఎస్ పదోతరగతి విద్యార్థిని శశికళ 2021-22 విద్యాసంవత్సరంలో రూపొందించిన ప్రాజెక్టు రాష్ట్ర స్థాయికి ఎంపికైంది. రూ. 800 ఖర్చుతో శరీరంలో కొవిడ్ ఉష్ణోగ్రతను గుర్తించే గుర్తింపు కార్డును తయారు చేశారు. కార్డు మెడలో వేసుకుంటే ఎదుటి వ్యక్తి శరీర ఉష్ణోగ్రత ఎక్కువుంటే శబ్దంతో హెచ్చరిస్తుంది. వెంటనే మనం భౌతికదూరం పాటించవచ్చు.
ఊయలతో పెయింటింగ్.. లింగాల జడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి చరణ్ తేజ (2021-22 విద్యా సంవత్సరం) అపార్టుమెంట్లు, పెద్ద భవనాలకు రంగులు వేసే కార్మికులు ప్రమాదాల బారిన పడకుండా వెనుక భాగంలో కవచం ఉండేలా రూపొందించిన ప్రాజెక్టు రాష్ట్రస్థాయికి ఎంపికైంది. రూ. 500తో రెక్సిన్, లెదర్ సాయంతో వెనక్కి పడిపోకుండా షీట్ ఏర్పాటు చేశారు. ఊయలలా ఉండే షీట్ సాయంతో ప్రమాదాలబారిన పడకుండా ప్రాణాపాయం లేకుండా సులువుగా పెయింటింగ్ పని చేసుకోవచ్చు.
సద్వినియోగం చేసుకోవాలి: 'ఇన్‌స్పైర్ మనక్‌కు ప్రైవేట్ పాఠశాలల నుంచి తక్కువ సంఖ్యలో నామినేషన్లు రావడంతో వారికి ప్రత్యేకంగా సలహాలు, సూచనలు ఇస్తున్నాం. విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనేలా హెచ్‌ఎంలు, సైన్స్ ఉపాధ్యాయులు చొరవచూపాలి. గ్రామీణ విద్యార్థులకు ఇది చక్కని అవకాశం. సద్వినియోగం చేసుకుంటే నగదు ప్రోత్సాహకాన్ని అందుకోవచ్ఛు ప్రాజెక్టుల తయారీ, నామినేషన్లు పంపడంలో సందేశాలు ఉంటే జిల్లా సైన్స్ అధికారి చరవాణి నం. 99899 21105లో సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చు.' - గోవిందరాజులు, డీఈవో నాగర్‌కర్నూల్