నాగర్ కర్నూల్ జిల్లా ఊపిరి పీల్చుకుంటోంది. కరోనా పాజిటివ్ కేసులు కొత్తవి నమోదు కాకపోగా.. పరీక్షలకు పంపిన 86 నమూనాల్లో 83 మందికి కరోనా లేదని తేలడం వల్ల కందనూలు కాస్త ఉపశమనం పొందింది. దిల్లీలో మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిని 11 మందిని గుర్తించిన అధికార యంత్రాంగం వారికి పరీక్షలు జరపగా కేవలం ఇద్దరికి మాత్రమే పాజిటివ్ ఉన్నట్లుగా తేలింది. ఆ ఇద్దరూ ప్రస్తుతం గాంధీలో చికిత్స పొందుతుండగా.. వారి ప్రైమరీ కాంటాక్ట్స్ 39 మందిని ఉయ్యాలవాడలోని ప్రభుత్వ క్వారంటైన్లో ఉంచారు.
తాండూరు ప్రభుత్వ ఆసుపత్రి క్వారంటైన్లో ఉన్న 9 మందిని, కల్వకుర్తి క్వారంటైన్లో ఉన్న 25 మందికి కారోనా నెగిటివ్ వచ్చినందున వారిని ప్రభుత్వ క్వారంటైన్ నుంచి హోమ్ క్వారంటైన్‌కు నాగర్‌కర్నూల్ ఆర్డీఓ నాగలక్ష్మి తరలించారు. వారి చేతులపై ప్రత్యేక స్టాంపులు వేసి 21 రోజులపాటు ఇంటి నిర్బంధంలోనే ఉంటామని వారి నుంచి లిఖిత పూర్వక వాగ్మూలం తీసుకుని ఇళ్లకు తరలించారు.
ప్రస్తుతం ముగ్గురు నాగర్ కర్నూల్ ప్రభుత్వాసుపత్రిలో ఐసోలేషన్‌లో ఉండగా.. ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్న వారిని హోం క్వారంటైన్‌కు పంపించారు. ఇక నాగర్ కర్నూల్ జిల్లాకు విదేశాల నుంచి వచ్చిన 123 మంది 14 రోజుల గడువు ముగించుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 907 మందిలో 184 మంది మాత్రమే 14 రోజుల గడువు పూర్తి చేసుకోవాల్సి ఉంది. ఇతర జిల్లాల నుంచి వచ్చిన 24వేల మందిలో 14వేల మంది హోం క్వారంటైన్‌ను పూర్తి చేసుకున్నారు.
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు సుమారు 4వేల మందిని గుర్తించి వారికి నిత్యావసర వస్తువులు సైతం ఇప్పటికే పంపిణీ చేశారు. జిల్లాలో కేసులు లేకపోయినా లాక్ డౌన్‌ను మాత్రం అధికారులు కచ్చితంగా అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 287 కేసులు నమోదు కాగా.. 729 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు పాటించని 42 దుకాణాలను సీజ్ చేశారు.
ఇవీ చూడండి: కరోనా ఉన్మాదం: దుకాణంలో సరకులను నాలుకతో..