Solar System in Tribal Areas: సమాజానికి దూరంగా ఎక్కడో అడవి ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులకు సరైన సౌకర్యాలు ఉండవు. ఫోన్, ఇంటర్నెట్, టెక్నాలజీ వంటి అంశాల సంగతి దేవుడెరుగు.. వారికి తాగునీరు, వైద్యానికి ఆసుపత్రి, చదువుకునేందుకు పాఠశాల, విద్యుత్తు వంటి మౌలిక వసతులూ ఉండవు. అలాంటి ప్రాంతాలకు విద్యుత్తును అందించడానికి తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ (రెడ్ కో) నిర్ణయం తీసుకుంది. దీనికోసం ఆయా చోట్ల సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసింది.
రెడ్ కో ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఈ సోలార్ వ్యవస్థలను ఏర్పాటు చేసింది. తాజాగా నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం కొల్లంపెంట, కొమ్మన పెంటలోని 39 గుడిసెలకు సోలార్ విద్యుత్తు సౌకర్యం కల్పించింది. టైగర్ రిజర్వ్ ఫారెస్టులోని రెండు.. చెంచుపేటల్లోని ఒక్కో ఇంటిలో 300 వాట్స్ విద్యుత్తు వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రతి ఇంటికీ 3 ఎల్ఈడీ బల్బులు, ఒక బీఎల్డీసీ సీలింగ్ ఫ్యాన్ అందించారు. లైట్లు, ఫ్యాన్ల నిర్వహణను అయిదేళ్ల వరకు ఏర్పాటు చేసిన గుత్తేదారు సంస్థ చూసుకుంటుంది. అవి మరమ్మతులకు గురైతే వాటి స్థానంలో కొత్తవి ఇచ్చేలా సదరు సంస్థతో రెడ్ కో ఒప్పందం కుదుర్చుకుంది.
ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు ఇలా : నాగర్ కర్నూల్ జిల్లా మన్ననూరు ఐటీడీఏ పరిధిలో పడర మండలం గీసగండిలో - 9, అమ్రాబాద్ మండలం కొల్లంపేట, మొల్కమామిడిలో-8, కొమ్మనపెంటలో-31, ఫరాహబాద్‌లో -8, మల్లాపూర్‌లో- 22, లింగాల్ మండలం బౌరాపూర్‌లో-12, ఎరియపెంటలో- 29, రాంపూర్‌లో- 25, అప్పాపూర్‌లో- 38, సంగిడి గుండాలలో-15, మెడిమల్కల- 19 గుడిసెలకు విద్యుత్తు సౌకర్యం కల్పించారు.
మరిన్ని ఏర్పాటు చేసేందుకు కొనసాగుతోన్న పనులు..: ఆదిలాబాద్ ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలో 109 గుడిసెలకు విద్యుత్తును అందించారు. ఉట్నూర్ మండలం లెండిగూడలో-17, ధర్మాజీపేట్‌లో- 28, ఎర్రగుట్టలో -11, శాంతాపూర్‌లో-7, మర్కగూడలో- 15, నిర్మల్ జిల్లా కడెం మండలం మిద్దె చింతలో-31 ఇళ్లకు ఈ సౌకర్యం ఉంది. మొత్తంగా ఇప్పటి వరకు ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 325 ఇళ్లలో సోలార్ వెలుగులు నింపామని రెడ్ కో అధికారులు తెలిపారు. ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో మరో 328 ఇళ్లలో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు పనులు కొనసాగుతున్నాయని రెడ్ కో ఛైర్మన్ సతీశ్ రెడ్డి తెలిపారు.
ఇవీ చదవండి: మానవ రహిత ట్రాక్టర్‌ను ఆవిష్కరించిన కిట్స్ విద్యార్థులు.. ఎలా పనిచేస్తుందంటే..?