విలువలతో కూడిన విద్యను పేద విద్యార్థులకు అందిస్తున్న ఎక్సైజ్ సీఐ ఏడుకొండలు ఎంతో మందికి స్ఫూర్తి అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఆర్పీఎఫ్ విశ్రాంత డీజీపీ ఎంవీ కృష్ణారావు పేర్కొన్నారు. నాగర్ కర్నూల్లో జడ్పీ ఉన్నత పాఠశాలలో జిల్లాలోని నిరుపేద విద్యార్థులకు, నిరుద్యోగులకు ఎక్సైడ్ సీఐ ఏడుకొండలు ఆధ్వర్యంలో ఇస్తున్న శిక్షణాశిబిరాన్ని ఎంవీ కృష్ణారావు సందర్శించారు. నిరుద్యోగ యువతీయువకులతో ముచ్చటించారు.
సొంత నిధులతో ఆన్లైన్లో రాష్ట్రంలోని 31 ప్రాంతాల్లో ఉచిత శిక్షణ అందిస్తున్న విధానాన్ని పరిశీలించి అభినందించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విద్యార్థులు అడిగిన పలు సందేహాలను నివృత్తి చేశారు. విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని వారి సందేహాలను తీర్చడం ఆనందంగా ఉందన్నారు. ఈ కాలంలో విలువలతో కూడిన విద్యను అందిస్తున్న ఏడుకొండలు లాంటి వారు మరెంతో మంది విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని ఎంవీ కృష్ణారావు తెలిపారు.