నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో టీఎల్ఎప్ ఆధ్వర్యంలో ప్రైవేట్ అధ్యాపకులు, ఉపాధ్యాయులు ఆకలి దీక్ష చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అయినా నిరుద్యోగులకు, ప్రైవేట్ అధ్యాపకులకు, ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందనుకుంటే.. ఆశలు అడియాసలు చేసిందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర అభాగ్యులకు అండగా ఉండాల్సింది పోయి.. ఉన్నోళ్లకు, పారిశ్రామికవేత్తలకు కొమ్ము కాస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు టీఎల్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు రామకృష్ణ.
ప్రైవేటు యాజమాన్యాలు జీతాలు చెల్లించక కరోనా సమయంలో ప్రైవేటు టీచర్లు, లెక్చరర్లు తిండికి కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. ప్రభుత్వం అడ్వకేట్లను ఆదుకున్నట్లుగానే, ప్రైవేటు అధ్యాపక, ఉపాధ్యాయ ఉద్యోగులను కూడా ఆదుకోవాలని కోరారు. నెలకు కనీసం పదిహేను వేల రూపాయల చొప్పున చెల్లించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు ప్రైవేటు కళాశాలలో పనిచేసే అధ్యాపకులు, ఉద్యోగులు అభద్రతా భావంతోనే జీవితాలను గడుపుతున్నారని ఆయన అన్నారు.
విద్యాబుద్ధులు నేర్పాల్సిన ప్రైవేట్ అధ్యాపకులు, ఉపాధ్యాయులు గ్రామాల్లో ఉపాధి హామీ పనులు, పండ్లు, కూరగాయలు అమ్మి జీవనోపాధిగా చేసుకొని జీవనం కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు టీఎల్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సదానందం గౌడ్, నాయకులు ఆనంద్ కుమార్, రాజేందర్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో ఈరోజు 206 మందికి కరోనా