నీటిని పొదుపుగా వాడి భూగర్భజలాన్ని పెంచేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని జిల్లా పాలనాధికారి ఎల్.శర్మన్ చౌహన్ పేర్కొన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం హౌసింగ్ బోర్డ్ కాలనీలో భూగర్భంలో నీటిమట్టాన్ని కొలిచే యంత్రాన్ని కలెక్టర్ ప్రారంభించారు.
భూగర్భంలో నీటిని ఏవిధంగా ఈ ఫీజో మీటర్ కొలుస్తుందో.. ఏవిధంగా పనిచేస్తుందో సంబంధిత శాఖల అధికారులను ఆయన అడిగి తెలుసుకున్నారు. అండర్ గ్రౌండ్లో నీటి లభ్యత శాతాన్ని తెలుసుకునే విధంగా అత్యాధునిక వసతులను జిల్లాలో ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుత సాంకేతికతతో ప్రతి 6 గంటలకు ఒకసారి అధికారి అక్కడకి వెళ్లకుండానే ఆయా ప్రాంతాల్లో ఎంతమేరకు వాటర్ లెవెల్ ఉందో తెలుసుకోవచ్చన్నారు.
నీటి శాతం ప్రతి 6 గంటలకు ఒకసారి ఆన్లైన్లో ఆటోమాటిక్‌గా నమోదవుతుందన్నారు. జిల్లాలో కొల్లాపూర్, వంగూర్, నాగర్‌కర్నూల్, తెలకపల్లి, ఉప్పునుంతల, బిజినాపల్లి, లింగాల, తిమ్మాజిపేట, కల్వకుర్తి మొత్తం తొమ్మిది మండలాల్లో ఫీజో మీటర్లను ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. భూగర్భ జలాన్ని సంరక్షించేందుకు ప్రతి ఒక్కరూ తమ ఇంటి ప్రాంగణంలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు.
ఇదీ చూడండి: వీరజవాన్ మహేశ్ కుటుంబానికి ఆర్థికసాయం ప్రకటించిన కేసీఆర్