శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ ప్రమాదంపై సీబీఐ విచారణ కోరాలని కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ రాశారు. ఎంపీ రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ ఏడు పేజీల లేఖ రాశారు.
తక్కువ చేసి చూపిస్తున్నారు..
శ్రీశైలం దుర్ఘటనపై నిజానిజాలను వెలికి తీయడానికి భిన్నంగా... ప్రమాద తీవ్రతను తక్కువ చేసి చూపించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. ఇది ప్రమాదం కాదని... నిర్లక్ష్యంతోనే జరిగిందంటూ అన్నీ వేళ్లూ ప్రభుత్వం వైపే చూపిస్తున్నాయని పేర్కొన్నారు. ఇప్పడు జరుగుతున్న సీఐడీ విచారణపై విశ్వసనీయత లేదని.. ఉద్యోగుల ఆరోపణలకు సంబంధించి మరింత లోతుగా విచారణ చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.
అవినీతి, నిర్లక్ష్యమే కారణం
ప్లాంటులో అన్ని వ్యవస్థలు కుప్పకూలడం పలు అనుమానాలకు తావిస్తోందని ఆరోపించారు. అంతేకాకుండా జెన్‌కో కేంద్ర కార్యాలయంలో సంతాప సభ పెట్టకపోవడానికి కారణం ఏంటని ప్రశ్నించారు. అమ్రాబాద్ అడవుల్లో సభ పెట్టుకుని, కన్నీళ్లు పెట్టుకునే దుస్థితికి కారణం ముఖ్యమంత్రి కాదా అని నిలదీశారు. ఘటన వెనుక నిర్లక్ష్యం, అవినీతి ఉందనడానికి సాంకేతిక ఆధారాలున్నాయని... కేంద్ర ఇందన శాఖ మాజీ కార్యదర్శి శర్మ కూడా ఇదే అనుమానం వ్యక్తం చేశారని పేర్కొన్నారు. సంస్థ సీఎండీ ప్రభాకర్ రావు దీనిని చిన్నదిగా చూపే ప్రయత్నం చేయడం దుర్మార్గమైన చర్యగా వారు అభివర్ణించారు. ఈ ఘటనపై వెంటనే స్పందించాలని... లేకుంటే ఆందోళనలు చేస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: సినీనటి తమన్నా ఇంట్లో కరోనా కలకలం