నాగర్‌కర్నూల్ జిల్లా ఎల్లూరు లిఫ్ట్‌లో ఐదో మోటారుకు మరమ్మత్తులు, రెగ్యులేటరీ పనులు చేపడుతున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌తోపాటు రంగారెడ్డి జిల్లాల్లో కొన్ని గ్రామాలు, పురపాలికలకు మిషన్ భగీరథ(mission bhagiratha) నీరు నిలిచిపోనుంది. 3,556 ఆవాసాలు, 20 పురపాలికలకు సరఫరా తాత్కాలికంగా ఆపివేయనున్నారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీరందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అందుబాటులోని బోర్లను నీటి సరఫరాకు వినియోగించుకోవాలని సర్పంచ్‌లు, పురపాలిక కమిషనర్లను ఆదేశించారు. అవసరమున్న బోర్లకు మరమ్మత్తులు చేపట్టి... వారంలో పూర్తి చేసుకోవాల్సిందిగా మిషన్ భగీరథ అధికారులు సూచించారు. వీలైనంత వరకూ కుళాయిల ద్వారా నీరు అందించాలని... నల్లా కనెక్షన్లు(tap connections) లేని చోట ట్యాంకర్లు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ట్యాంకర్లే ప్రత్యామ్నాయం
ప్రస్తుతం మిషన్ భగీరథ నీళ్లు నిలిచిపోనుండటంతో 15వ ఆర్థిక సంఘం నిధులతో సర్పంచ్‌లు మోటార్లను మరమ్మతులు చేయిస్తున్నారు. గతంలో మరమ్మత్తులు చేసిన వాటికే ఇంకా బిల్లులు రాకపోవడంతో డబ్బులు ఖర్చు చేసేందుకు ముందుకు రావడం లేదు. చాలాచోట్ల బోర్లు పనిచేయకపోవడంతో అద్దెబోర్లు, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ముఖ్యంగా తండాలు, చిన్న గ్రామపంచాయతీల్లో ట్యాంకర్ల ద్వారా సరఫరా తప్ప ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
పొదుపు వాడకం
గ్రామాల్లో ట్యాంకులు నింపుకుని నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు యోచిస్తున్నారు. నీటి లభ్యత తక్కువగా ఉన్నందున 2, 3 రోజులకోసారి మంచినీళ్లు అందేలా చర్యలు చేపడుతున్నారు.
ఇదీ చదవండి: Lockdown Effect: ఆర్థిక సుడిగుండంలో కూరగాయల రైతు