నాగర్ కర్నూల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. జిల్లాలోని చెరువులు, కుంటలు వాగులు మత్తడి పోతున్నాయి. వరద తాకిడి వల్ల నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని రహదారులు జలమయమయ్యాయి. పలు కాలనీల్లో రోడ్లు కొట్టుకుపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
కాలనీలు చెరువులను తలపించాయి. ప్రధానంగా కేసరి సముద్రం చెరువులోకి భారీగా నీరు చేరడం వల్ల చెరువు రెండు దిక్కుల నుంచి అలుగు పారుతోంది. చెరువు పరిసరాల్లోని స్నేహపురి, రామ్ నగర్, హౌసింగ్ బోర్డ్, ఓం నగర్ కాలనీలోకి భారీగా వరద నీరు వచ్చింది. ఇళ్లల్లోకి నీళ్లు రావడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ పరిస్థితి తలెత్తిందని ఆందోళన చెందుతున్నారు. నాగర్ కర్నూల్ చెరువు అలుగుకు చెక్కలు వేయడం వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తిందని వాపోయారు.
సుమారు 20 నుంచి 30 ఇళ్ల వరకు రెండు ఫీట్ల నీరు చేరింది. దీంతో ఆయా ప్రాంతాల్లో ఇళ్లు ఖాళీ చేసి బయట ప్రాంతాలకు వెళ్లారు. ఇళ్లలోకి వెళ్లాలంటే మోకాళ్ల లోతు నీళ్లలో నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. నీరు రావడం వల్ల ఈగలు, దోమలు రాత్రి నుంచి విద్యుత్ లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. డ్రైనేజ్ వాటర్ కూడా పొంగిపొర్లడం వల్ల ఇంట్లో కలుషితమైన వాతావరణం చేరి రోగాల బారిన పడే అవకాశాలు ఉన్నాయని వాపోతున్నారు.
ఎడతెరిపి లేకుండా వర్షం కురవడం వల్ల పట్టణంలోని రామ్ నగర్ కాలనీలోని మాడుగుల మంగమ్మ ఇల్లు కూలిపోయింది. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరింది. తక్షణమే చెరువు అలుగుకు వేసిన చెక్కలను వెంటనే తొలగించి తమ ఇళ్ల మధ్య నిలిచిన నీటిని తొలగించాలని బాధితులు కోరుతున్నారు. ఇదిలా ఉంటే నియోజకవర్గంలోని నల్లవాగు, తూడుకుర్తి, పులిజాల, మల్కాపూర్, తాళ్లపల్లి, చెర్ల ఇటిక్యాల, గ్రామాల్లో చెరువులు పొంగి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. బిజినాపల్లి మండలం పాలెం పెన్టోనీ చెరువు అలుగు ఉద్రిక్తంగా మారడం వల్ల గుడ్ల నర్వ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి.
ఇదీ చదవండి: దేవరకద్రలో భారీ వర్షం.. పొంగిపొర్లుతున్న వాగులు