Somasila Cottages Price for Booking: నల్లమల అటవీ ప్రాంతంలో కృష్ణాతీరంలో ఓ ద్వీపంలా కనిపిస్తోంది నాగర్‌కర్నూల్ జిల్లాలోని సోమశిల. సహజ సిద్ధమైన ప్రకృతి అందాలతో పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచుతోంది. ప్రసిద్ధి చెందిన సోమశిల నుంచి శ్రీశైలం వరకు దాదాపు 120 కిలోమీటర్ల దూరం అడవి ప్రాంతం. చుట్టూ పచ్చని ప్రకృతి అందాలు, వన్యప్రాణులు, ఆదిమజాతి చెంచులకు నెలవు ఈ ప్రాంతం. కానీ ఇక్కడ పర్యాటక రంగాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పచెప్పడం.... వీక్షకుల జేబులకు చిల్లులు పెడుతోంది
స్వదేశీ దర్శిని కింద డెవలప్మెంట్
2015లో స్వదేశీ దర్శిని కింద కేంద్రం నిధులతో సోమశిల(somasila tourism), ఉమా మహేశ్వరంలో 10 కాటేజీలు, హరిత హోటల్ నిర్మించారు. ఎకో టూరిజం అభివృద్ధితో ఆదాయం పొందడంతో పాటు స్థానికులకు ఉపాధి పెంచాలనేది ప్రభుత్వం లక్ష్యం. కానీ కరోనా లాక్‌డౌన్‌తో(Corona lockdown in telangana) పర్యాటకం పూర్తిగా నష్టపోయింది. కాటేజీలను ప్రైవేటు వారికి లీజుకు ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా నల్లమల పర్యాటకం డబ్బుతో కూడుకున్న వ్యవహారంగా మారింది. ఇక్కడ కాటేజీల్లో చాయ్ దగ్గర్నుంచి మొదలుకుని బిర్యానీ వరకు ఇష్టారీతిన వసూళ్లకు పాల్పడుతున్నారని పర్యాటకులు ఆరోపిస్తున్నారు.
టూరిస్టుల జేబుకు చిల్లు..
Somasila cottages price: సోమశిల కాటేజీల్లో ఒక చాయ్‌కి రూ.42 , కాఫీకి రూ.50, భోజనానికి ఏకంగా 200 రూపాయలు వసూలు చేస్తున్నారు. చికెన్ బిర్యానీ రూ.320, మటన్ బిర్యానీ ప్లేట్ రూ.420 ఇలా విపరీతంగా ధరలు పెంచేశారు. టూరిజం శాఖ ఆధ్వర్యంలో సోమశిల కాటేజీలు నిర్వహించినపుడు.... ఏసీ కాటేజీ రూ.1,670 ఉండగా ఇప్పడు రూ.3,920 వసూలు చేస్తున్నారు. నాన్ ఏసీ గదుల్లోనూ ఇదే రీతిన ధరలు పెంచేశారు. ఈ తరహా ధరలుంటే రానున్న రోజుల్లో విహారానికి వచ్చే వారి సంఖ్య తగ్గిపోతుందని పర్యాటకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చిన్న ఫ్యామిలీ ఒక్క రూం తీసుకొని ఒక రోజు ఉందామనుకుంటే రూ.3వేలకు పైగా అవుతోంది. ఇక పెద్ద ఫ్యామిలీ రావాలంటే రూంకు రూ.పదివేల చొప్పున కేటాయించాలి. కనీసం ఒక టీ తాగాలంటే రూ.50కి పైనే ఖర్చవుతోంది. ఈ రేట్లను అదుపుచేయాలంటే ప్రభుత్వం, అధికారులు పర్యవేక్షించాలి.
-టూరిస్టులు
కరోనా ఎఫెక్ట్‌తో కుదేలు
ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాటేజీ , హోటల్స్ నిర్మాణం చేశారు. (somasila tourist places)సోమశిల, సింగోటం, అక్కమహాదేవి గుహలు, కదల్లీవనం, పరిహాబాద్, మల్లెల తీర్థం, ఉమామహేశ్వరం, ఈగలపెంట ప్రాంతాల్లో ఎకో టూరిజం అభివృద్ధి కోసం కాటేజీలు, హోటల్‌కు రూ.91.60కోట్లు మంజూరు చేసింది. ఉమామహేశ్వరం, సోమశిల , హరిత హోటల్ , కాటేజీలు నిర్మించారు. ఈ సౌకర్యాలు ఉండడంతో టూరిస్టుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూ వచ్చింది. కరోనా వల్ల పూర్తిగా ఆదాయం కోల్పోయింది. సోమశిల కాటేజీ ధరల దందా పైస్థాయి వారితో చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
ఒకరోజు రాత్రి బస చేయాలంటే దాదాపు రూ.4వేలు ఉండాలి. ఏసీ వంటి సౌకర్యాలు కావాలంటే ఇంకా అదనం. భోజనం వచ్చేసి రూ.400. టీ 42రూపాయలు. ఇక రూంలు రూ.4వేల నుంచి 4,500 వరకు ఉన్నాయి. ఈ రేట్లతో టూరిస్టులకు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం స్పందించాలి. ఈ ధరల విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలి.
-టూరిస్టులు
పర్యాటక శాఖ పర్యవేక్షణ కొరవడటం వల్లే ఇష్టారీతిన వసూళ్లకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: Threat to wildlife nallamala forest: వన్యప్రాణులకు ప్రాణ సంకటంగా వాహనాలు..