Govt School Land Kabza Veldanda Mandal : అక్రమార్కుల కన్నుపడితే చాలు.. అసైన్డ్, దేవాదాయ, భూదాన్, చెరువులు, కుంటలు, కాలువలు, వాగుల భూములే కాదు.. ప్రభుత్వ విద్యాసంస్థల స్థలాలూ ఆక్రమణకు గురవుతున్నాయి. ముఖ్యంగా జాతీయ రహదారులకు ఆనుకుని ఉండి, ఇటీవల ధరలకు రెక్కలొచ్చిన భూముల్ని అక్రమంగా కబ్జా చేసేందుకు భూబకాసురులు ప్రయత్నిస్తున్నారు. శ్రీశైలం- హైదరాబాద్ జాతీయ రహదారి ఆనుకుని నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పెద్దాపూర్ పంచాయతీ పరిధిలోని.. తుంకిబండతండా ప్రాథమిక పాఠశాల స్థలం సైతం అలాగే ఆక్రమణకు గురైంది.
Nagarkarnool School Land Kabza : రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే నంబర్ 51లో ఈ పాఠశాలకు 28 గుంటలు అంటే.. 3388 చదరపు గజాల స్థలం ఉంది. కానీ భౌతికంగా అక్కడ ప్రస్తుతం 12గుంటలు అంటే 1520 చదరపు గజాల స్థలమే ఉంది. మిగతా 18గుంటల భూమి స్థలం ఆకమ్రణకు గురైంది. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్నఈ పాఠశాల చుట్టుపక్కల ప్రస్తుతం చదరపు గజం రూ.20వేల పైగా పలుకుతోంది. అంటే ఆక్రమణకు గురైన స్థలం విలువ రూ.3కోట్లకు పైగానే ఉంటుందని తెలుస్తోంది.
ఈ విషయంపై పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కవిత మండల విద్యాశాఖ అధికారి, స్థానిక తహసీల్దార్ దృష్టికి తీసుకువచ్చారు. పాఠశాల సరిహద్దులు నిర్ణయించాలని కోరారు. పాఠశాల స్థలం కబ్జాకు గురైనట్లుగా, సరిహద్దులు నిర్ణయించాలని మండల సర్వసభ్యసమావేశంలోనూ అధికారులను కోరామని.. కుప్పగండ్ల ఎంపీటీసీ చక్రవర్తి గౌడ్ చెప్పారు. అయినా అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.
"ప్రభుత్వ స్థలం దురాక్రమణకు గురి కాకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాం. ఎమ్ఆర్వో కార్యాలయంలో పాఠశాల స్థలం 28 గుంటలు ఉంది. తహసీల్దార్ పాఠశాల భూమిని గుర్తించి హద్దులు పాతాలని కోరుతున్నాం." - కవిత ప్రధానోపాధ్యాయురాలు
ఈ విషయంపై వెల్దండ ఇంచార్జ్ మండల విద్యాశాఖ అధికారి శంకర్ వివరణ కోరగా తహసీల్దార్ దృష్టికి తీసుకువెళ్లి హద్దులు గుర్తిస్తామని తెలిపారు. పాఠశాల స్థలం కబ్జాకు గురైందని గ్రామస్థులు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఫిర్యాదు చేశారని.. వీలైనంత త్వరగా హద్దులు గుర్తించి పాఠశాల స్థలాన్ని వారికి అప్పగిస్తామని తహసీల్దార్ రవికుమార్ తెలిపారు.
"సర్వే నంబర్ 51/4లో 28గుంటలు తండా స్కూల్‌కి ఇవ్వడం జరిగింది. పక్కన వెంచర్ వారు ఈ భూమిని ఆక్రమించుకున్నారు. దానిపై విచారణ చేపట్టి స్కూల్‌కి ఎంత అయితే స్థలం ఉందో దానికి కంచె నిర్మించి హద్దులు పాతుతాం. దీని గురించి మాకు హెచ్ఎమ్ ఫిర్యాదు చేశారు." - రవి కుమార్, తహసీల్దార్, వెల్దండ
శ్రీశైలం - హైదరాబాద్ జాతీయ రహదారికి ఆనుకుని భూముల ధరలు ఇటీవల బాగా పెరిగాయి. తునికిబండ తండా ప్రభుత్వ పాఠశాల సైతం జాతీయ రహదారికి ఆనుకునే ఉంది. దీన్ని ఆసరాగా చేసుకున్న కొందరు పాఠశాల స్థలంలోకి చొచ్చుకుని వచ్చి.. ప్రహరీ సైతం నిర్మించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆధారాలున్నా అధికారులు చర్యలకు ఉపక్రమించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి.
ఇవీ చదవండి: