కొవిడ్ వ్యాప్తి, లాక్‌డౌన్ నేపథ్యంలో విద్యార్థులకు ఆన్‌లైన్ చదువులు అనివార్యమయ్యాయి. చదువు మాత్రమే కాదు వైద్యం, అమ్మకాలు, కొనుగోళ్లు, ఉద్యోగాలు, లావాదేవీలు ఇలా అన్నీ ఆన్‌లైన్ వేదికగా కొనసాగుతున్నాయి. సెల్‌ఫోన్లు, అంతర్జాలం వినియోగం తప్పనిసరైంది. ఇదే సమయంలో సైబర్ నేరాలు సైతం పెరుగుతున్నాయి. ఆన్‌లైన్‌లో తరగతులు వింటున్న విద్యార్థులు సైబర్ మోసాల బారిన పడకుండా... అంతర్జాలంతో పాటు మొబైల్ వినియోగంపై అవగాహన కల్పించేందుకు సైబర్ కాంగ్రెస్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ పోలీసు శాఖ. విద్యాశాఖ, స్వచ్ఛంద సంస్థలు, మహిళా భద్రతా విభాగం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.
'రాష్ట్రంలోని 33జిల్లాల్లో ప్రతి జిల్లా నుంచి 50 పాఠశాలల్ని ఎంపిక చేసి... ఒక్కో పాఠశాల నుంచి ఉపాధ్యాయుడు, ఇద్దరు విద్యార్థుల చొప్పున 1650 మంది ఉపాధ్యాయులకు, 3300 మంది విద్యార్థులకు ఆన్‌లైన్‌లో శిక్షణ అందిస్తున్నారు. 2 నెలలకు ఒక సెషన్ చొప్పున 5 సెషన్‌లు 10నెలల్లో పూర్తి చేస్తారు. శిక్షణ పూర్తైన విద్యార్థులను సైబర్ రాయబారులుగా సేవలందిచాలన్నది లక్ష్యం.'
-శోభారాణి, సైబర్ కాంగ్రెస్ నోడల్ అధికారి
ఎంతో అవసరం
జులై ఒకటి నుంచి సైబర్ కాంగ్రెస్ ప్రారంభమైంది. ఎంపికైన ఉపాధ్యాయులు, విద్యార్థులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ రంగాల్లోని నిపుణులతో శిక్షణ అందిస్తున్నారు. ఆన్‌లైన్ మోసాలు, వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లడం, అసభ్యకరమైన కంటెంట్, సామాజిక మాధ్యమ వేదికల ద్వారా వేధింపులు, మోసాలు, బెదిరింపులు, మహిళలు, పిల్లల లక్ష్యంగా జరిగే సైబర్ మోసాలను ఎలా ఎదుర్కోవాలో ఈ శిక్షణలో నేర్పనున్నారు. అందుకోసం ప్రత్యేకంగా అప్లికేషన్ సైతం రూపొందించారు. విద్యార్థులకు అసైన్‌మెంట్లు, కృత్యాలు ఇవ్వడం ద్వారా ప్రయోగాత్మక బోధన చేయనున్నారు. తొలి సెషన్‌లోనే ఎన్నో విషయాలు తెలుసుకున్నామని, మొబైల్ వాడకం తప్పనిసరైన ఈ సమయంలో శిక్షణ ఎంతో అవసరమని విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు.
'సైబర్ కాంగ్రెస్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సైబర్ నేరాలను నియంత్రించాలని... విద్యా వ్యవస్థలో ఆన్‌లైన్ భద్రతపై అవగాహన కల్పించాలని పోలీసు శాఖ భావిస్తోంది. తల్లిదండ్రులు, ఆడపిల్లలు, మహిళలు, యువతకు వీటిపై అవగాహన కల్పించనుంది. సైబర్ కాంగ్రెస్‌లో నేర్చుకున్న విషయాల్ని అంబాసిడర్లు తోటి విద్యార్థులకు, తల్లిదండ్రులకు, సమాజానికి అవగాహన కల్పించాల్సి ఉంటుంది. ఉపాధ్యాయులు సైతం సైబర్ నేరాల నియంత్రణలో తమవంతు పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులకు మాత్రమే కాదు.. అందరికీ అవగాహన తప్పనిసరి.'
-ఉపాధ్యాయులు
జులై 1 నుంచి ప్రారంభమైన సైబర్ కాంగ్రెస్... ఏప్రిల్ నెలలో ముగియనుంది. తొలి సెషన్‌లోనే రాష్ట్రవ్యాప్తంగా మంచి స్పందన లభిస్తోంది. ఎంపిక చేయని పాఠశాలల్లోనూ సైబర్ కాంగ్రెస్‌ను నిర్వహించాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: cyber fraud: సరుకుల పేరుతో సైబర్ మోసం.. నిందితుడు అరెస్ట్