సాధారణంగా అక్రమార్కులను ట్రాప్ చేసేందుకు ఏసీబీ అధికారులు పకడ్బందీ ప్రణాళిక రచిస్తారు. బాధితుడు వారికి లంచంగా ఇవ్వాల్సిన కరెన్సీ నోట్లను తామే అందజేస్తారు. వాటి నంబర్లను ముందుగానే పంచనామాలో నమోదు చేస్తారు. తర్వాత నోట్లకు ఫినాప్తలిన్ పౌడర్‌ను పూస్తారు. ఆ పౌడర్ పైకి ఏమాత్రం కనిపించదు. లంచావతారం వాటిని పుచ్చుకోగానే ఆ పౌడర్ అతడి చేతులకు అంటుకుంటుంది. అప్పటివరకు సమీపంలో వేచి ఉండే ఏసీబీ అధికారులు వెంటనే అక్కడికి చేరుకుంటారు. అక్రమార్కుడి నుంచి ఆ నోట్లను స్వాధీనం చేసుకుంటారు. అతడి చేతుల్ని సోడియం కార్బొనేట్ ద్రావణంతో ముంచుతారు. వెంటనే ఆ ద్రావణం ఎరుపు రంగులోకి మారుతుంది. అంటే.. ఫినాప్తలిన్ పౌడర్ పూసిన నోట్లను ఆ లంచావతారం తీసుకున్నాడనేందుకు ఆ ఎరుపు రంగే సంకేతంలా నిలుస్తుంది. అందుకే ‘రెడ్ హ్యాండెడ్’గా దొరికిపోయాడనే మాట పుట్టుకొచ్చింది. స్వాధీనం చేసుకున్న నోట్ల కట్టలతోపాటు ఎరుపెక్కిన ద్రావణాన్ని న్యాయస్థానానికి సమర్పిస్తారు. అక్రమార్కులకు శిక్షపడడానికి ఇదో బలమైన ఆధారం.
నాగర్‌కర్నూల్‌కు పాకిన రాజస్థాన్ కుయుక్తి
ఏసీబీ కేసుల్లో కీలకమైన ఆధారం కావడం వల్లే.. కొందరు అక్రమార్కులు దొరక్కుండా ఉండడానికి ఏకంగా నోట్ల కట్టల్ని కాల్చేయడానికి కూడా సిద్ధపడుతున్నారు. గత నెలలో రాజస్థాన్‌లోని ఓ తహసీల్దారు ఇలాగే సుమారు రూ.20 లక్షల లంచం సొమ్మును వంటింట్లో కాల్చేందుకు యత్నించాడు. ఇంటి తలుపు పగలగొట్టి మరీ ఏసీబీ అధికారులు లోపలికి ప్రవేశించి కొంతమేర కాలిన నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే గత వారం నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోనూ ఇలాంటి ఉదంతం చోటు చేసుకుంది. క్రషింగ్ యూనిట్‌కు అనుమతి ఇవ్వడానికి తహసీల్దారు సైదులు రూ.5 లక్షల లంచం అడిగారు. ఆ లంచం సొమ్ము తీసుకున్న మధ్యవర్తి వెంకటయ్యగౌడ్ ఏసీబీ అధికారుల్ని చూసి గ్యాస్ స్టౌపై కట్టల్ని తగలబెట్టేశాడు. 70 శాతం కాలిన నోట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
బూడిదైనా రుజువు చేసే ఆస్కారం
ఇలా నోట్ల కట్టల్ని కాల్చేసినా అక్రమార్కులు తప్పించుకోలేరని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. ఒకవేళ నోట్లు సగమేర కాలినా మిగతా వాటిపై నంబర్లుంటాయి కాబట్టి గుర్తించే వీలుంటుంది. పూర్తిగా కాల్చి బూడిద చేసినా ఫొరెన్సిక్ ప్రయోగశాలలో గుర్తించే సాంకేతికత ఉందంటున్నారు. ‘కాలిన నోట్ల బూడిద నమూనాల్ని సేకరించి ల్యాబ్‌కు పంపిస్తాం. అక్కడ ప్రత్యేక రసాయనంలో బూడిదను పరీక్షిస్తే అది కరెన్సీ నోట్లదే అనే విషయం తెలిసిపోతుంది. ప్రతి కరెన్సీ నోటుకు ఉండే సెక్యూరిటీ థ్రెడ్ ఆధారంగానూ ఈ విషయం నిర్ధారణ అవుతుంది..’ అని ఏసీబీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.