కేంద్రంలో మోదీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నల్ల చట్టాల వల్ల రైతులకు కనీస మద్దతు ధర దక్కదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలోని తాండ్ర గ్రామంలో రైతులతో ముఖాముఖి సమావేశాన్ని నిర్వహించారు. భాజపా పార్టీ వ్యాపారస్థుల పార్టీ అని, తెరాస ప్రాజెక్టుల ద్వారా కమిషన్లు వసూలు చేసే పార్టీ అంటూ విమర్శించారు.
ముఖ్యమంత్రి దిల్లీకి వెళ్లి మోదీని కలిసిన తర్వాత నల్ల చట్టాలను అమలు చేస్తున్నారంటూ భట్టి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులన్ని గతంలో కాంగ్రెస్ పార్టీ డిజైన్ చేసినవేనని గుర్తు చేశారు. రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు తీసివేస్తే ఊరుకోమని, అన్ని రకాల పంటలకు మద్దతు ధర ప్రకటించాల్సిందేనని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి మూడు సాగు చట్టాల గురించి స్పష్టమైన ప్రకటన చేసి, రైతులకు అండగా ఉండాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం రైతు చట్టాలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ముందుచూపు లేకుండా..
ఎలాంటి ముందుచూపు లేకుండా సన్నవడ్లు పండించమని రైతులకు చెప్పి వారికి కనీస మద్దతు ధర కూడా ప్రకటించలేదని భట్టి ఆరోపించారు. పంట దిగుబడి సరిగా రాక రైతులు చాలా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి.. ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని అన్నారు. పైగా ఫీల్డ్ అసిస్టెంట్లను ఉద్యోగాల నుంచి తొలగించారని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని రైతులందరికీ న్యాయం చేయాలని, లేని పక్షంలో రైతులు అందరతో కలిసి చలో హైదరాబాద్కి కవాతు చేస్తామని హెచ్చరించారు.