దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా తవ్వుతున్న సొరంగం అది. ములుగు జిల్లా రామప్ప చెరువు నుంచి వరంగల్ అర్బన్ జిల్లా దేవన్నపేట వరకూ... అంటే సుమారు 49 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఆసియాలోనే అతి పెద్ద జల సొరంగంగా రికార్డులకెక్కింది. సొరంగం లోపల అసాధారణ వాతావరణంలో పనిచేస్తున్నారు ఆ ఐదుగురమ్మాయిలు. ఆడపిల్లలు సుకుమారమనీ, శారీరక కష్టంలేని ఉద్యోగాలనే ఎంచుకుంటారనే అభిప్రాయాన్ని తలకిందులు చేశారు వీళ్లు. వాస్తవానికి ఇంతటి కష్టతరమైన పనులు చేయాల్సిన పరిస్థితులేమీ వారికి లేవు. వీరి జీవిత భాగస్వాములు ఉన్నతంగా స్థిరపడ్డారు. అయినా ఈ రంగంలోకి ఏరికోరి వచ్చారీ వనితలు. వీరిలో ప్రశాంతి, మమత... సివిల్, పద్మ, పావని... మెకానికల్, అపర్ణ ఎలక్ట్రికల్ ఇంజినీర్లు.
అసాధ్యం సుసాధ్యం
ఇష్టంతో పనిచేసినప్పుడు... అసాధ్యం అనేది ఉండదు అంటారు మమత. ‘రోజువిడిచి రోజు సొరంగంలోకి వెళ్లాలి. భూగర్భంలో సుమారు 130 మీటర్ల లోతు ఉంటుంది. ఊపిరి పీల్చుకోవడమూ కష్టమే కొన్నిసార్లు....అయినా సవాళ్లను ఎదుర్కొంటేనే కదా! మనమేంటో తెలిసేది అని’ చెబుతారామె. మమత తండ్రి ప్రభాకర్ విశ్రాంత సింగరేణి ఉద్యోగి. ఆయన గనుల్లో పనిచేసినా, ఎప్పుడూ లోనికి వెళ్లే అవకాశం రాలేదట. ఇప్పుడు మమత సొరంగంలో పని చేస్తుండటంతో ఆయన గర్వపడుతున్నారు. భర్త శ్రీకాంత్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. వీరికి ఓ పాప.
ఏసీలో విధులను కాదని...
ఒకసారి సొరంగంలోకి వెళ్తే తిరిగి వచ్చే వరకూ.... బాహ్యప్రపంచంతో సంబంధాలు ఉండవు. అలాగని ఎప్పుడూ ఈ పని మనకెందుకు అనిపించలేదంటారు ప్రశాంతి. ‘ఒక్కోసారి టన్నెల్‌లో రెండేసి కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి పనిచేయాలి. సొరంగం తవ్వేప్పుడు గోడల నుంచి నీరు ఊరి పొంగుతుంటుంది. మోకాలి లోతు నీళ్లు... వీటన్నింటి గురించి చెబితే అంతా భయపడతారు. ఇవేవీ నాకు సమస్యల్లా అనిపించలేదు. పని పూర్తి చేసి తిరిగొచ్చేవరకూ సమయమే తెలియదు’ అంటారామె. ప్రశాంతిదిది హుజూరాబాద్. తండ్రి నీటిపారుదల శాఖలో గుమస్తా. అక్కడ పనిచేసే ఇంజినీర్లను చూసి తానూ ఈ రంగంలోకి రావాలనుకున్నారామె. ఉద్యోగంలో చేరిన కొత్తలో.. భూగర్భంలో పనిచేయాలంటే ఎంతో ధైర్యం ఉండాలని, ఇది వద్దనుకుంటే ఆఫీసు పని అప్పగిస్తామని ఉన్నతాధికారులు అడిగినా ప్రశాంతి మాత్రం అందుకు ఒప్పుకోలేదు. భర్త పిల్లల వైద్యుడు. ఆర్థికంగా స్థిరపడ్డా... సవాల్‌తో కూడుకున్న దీన్నే ఎంచుకున్నారు.
కష్టమైనా ఇష్టంగానే...
2011లో వరంగల్ దగ్గర చలివాగు కింద పనులు జరుగుతుండగా రంధ్రం పడింది. సొరంగం నీటితో నిండిపోవడంతో ముగ్గురు చనిపోయారు. మళ్లీ 2016లో అన్ని జాగ్రత్తలతో పనులు మొదలయ్యాయి. ఆ విషాదం తర్వాత ఇక్కడ పనిచేయడం పెద్ద సవాలే అయినా పావని, అపర్ణ ధైర్యంగా ముందడుగు వేశారు. పావనిది మహబూబాబాద్ జిల్లా చీకటాయపాలెం. తాను పుట్టి పెరిగిన పల్లెటూరే తనలో ఏ పనైనా చేయగలననే ధైర్యాన్ని నింపిందని చెబుతారామె. ‘సొరంగంలో గంటల తరబడి ఉండి బయటికి రాగానే తలనొప్పి వస్తుంది. అసాధారణ పరిస్థితుల్లో పనిచేయడం వల్ల ఒళ్లు హూనం అయిపోతుంది. పొద్దున్నే విధుల్లోకి వెళ్తే...ఏ రాత్రికో ఇంటికొచ్చేది. కమ్యూనికేషన్ ఉండదు. పదినెలల పిల్లాడిని ఇంటి దగ్గర వదిలి వెళ్లడం కష్టమే అయినా... ఇష్టంగానే ఈ పని చేస్తున్నా. లోపల ఉన్నప్పుడు పని తప్ప మేం ఆడపిల్లలమనే విషయమే గుర్తురాదు’ అంటారామె. పావని భర్త గుత్తేదారు. వారికి ఇద్దరు అబ్బాయిలు.
అరగంట గాల్లో తేలా...
సాగునీటిశాఖ మంత్రిగా హరీశ్‌రావు ఉన్నప్పుడొకసారి ఈ సొరంగం వద్దకు వచ్చారు. అర్థరాత్రి దాకా అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేయడం చూసి ప్రశంసలు కురిపించడమే కాదు, మాతో ఫొటో దిగడం మరచిపోలేమని చెబుతున్నారు అపర్ణ. ‘ఓ సారి క్రేన్ ద్వారా లిఫ్టులో సొరంగంలోకి దిగుతున్నాం. విద్యుత్తు నిలిచిపోవడంతో మధ్యలోనే లిఫ్టు ఆగిపోయింది. అరగంట గాల్లో తేలుతూ ఉండిపోయాం. ఒకసారి లోపలికి దిగితే.. సెల్ సిగ్నల్స్ కూడా ఉండవు’ అంటారు అపర్ణ. భర్త సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఈమె రెండేళ్ల వయసున్న బాబుని వదిలి విధులకు వస్తున్నారు.
గాయాలే తీపి గుర్తులై..
వరంగల్‌కు చెందిన పద్మ తండ్రి రాంబాబు వడ్రంగి. ముగ్గురాడపిల్లల్ని బాగా చదివించాలనుకున్నారు. తండ్రి కష్టాల్నీ, కలల్ని అర్థం చేసుకున్న పద్మ... ప్రభుత్వోద్యోగం సంపాదించారు. పనిలో ఎదురయ్యే సవాళ్లు ఎప్పటికప్పుడు కొత్త పాఠాల్ని నేర్పుతాయంటారామె. ‘పైపులైన్లు వెల్డింగు చేసే సమయంలో పొగతో ఉక్కిరిబిక్కిరై ముఖం నల్లగా మారిపోతుంది. బరువైన గమ్‌బూట్లు వేసుకొని సొరంగంలో నడవడం మరింత కష్టం. కాళ్లకు, చేతులకు తగిలిన గాయాలెన్నో తీపి గుర్తులుగా మిగిలిపోయాయి. అయినా ఫర్వాలేదు’ అని నవ్వేస్తారు పద్మ. ఉన్నతాధికారులు, సహచరుల ప్రోత్సాహంతో ఎంత ఇబ్బందైనా తేలిగ్గా అధిగమిస్తున్నామని చెబుతున్నారు వీరు.
దేవాదుల మూడు దశలు పూర్తయితే అన్నదాత ముఖాల్లో పూసే వెలుగుల ముందు మా పనిలో ఉండే కష్టాలన్నీ చిన్నవే అంటారీ యువ సాహసులు.
-గుండు పాండురంగశర్మ, వరంగల్
ఇదీ చదవండి: సాగర్‌లో గెలుపే లక్ష్యం... ప్రధాన పార్టీల హోరాహోరీ ప్రచారం