ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత వారం రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం రికార్డు స్థాయిలో 45 డిగ్రీలు నమోదైంది. ప్రజలు విలవిల్లాడుతున్నారు. కాలు తీసి బయట పెట్టలేకపోతున్నారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఇటీవల కొన్ని చోట్ల కురిసిన వర్షానికి వాతావరణం చల్లబడింది. తిరిగి ఒక్కసారిగా భానుడు భగభగమంటున్నాడు.
ఎండాకాలం ఆరంభం నుంచి మార్చి, ఏప్రిల్ నెలలు దాదాపుగా లాక్‌డౌన్ ఉండటంతో ప్రజలు బయటకు రాలేదు. కానీ లాక్‌డౌన్ సడలింపులతో ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. కానీ ఎండలు ఎక్కువగా ఉండటంతో తట్టుకోలేకపోతున్నారు. వేడిమితో పాటుగా వడగాలులు సైతం వీస్తున్నాయి. దీంతో మరింతగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరికొన్ని రోజులు ఇలాగే ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
జాగ్రత్తలు తప్పనిసరి..
రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో అప్రమత్తంగా ఉండాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ఉదయం 10 గంటలలోపు పనులు ముగించుకుని నీడపట్టునే ఉంటే మంచిది. లేకపోతే వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇది ప్రాణాలకే ప్రమాదం. వీలయినంతగా నీడపట్టునే ఉండాలి. బయటకు వెళితే గొడుగు పట్టుకుని వెళ్లాలి. శరీరంలో నీటినిల్వలను తగ్గకుండా చూసుకోవాలి. ఎక్కువగా నీళ్లు తాగాలి. వదులుగా ఉండే కాటన్ దుస్తులను ధరించాలి. ఎండకు వెళ్లి వచ్చి తర్వాత శరీరం సహకరించకుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.