తెలంగాణ నయాగరాగా పేరొందిన బొగత జలపాతానికి సందర్శకుల తాకిడి క్రమేపీ పెరుగుతోంది. ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలో నెలకొన్న ఈ జలపాతానికి... ఈసారి కాస్త ఆలస్యంగా జల కళ వచ్చింది. ప్రధానంగా ఎగువ ప్రాంతంలోని ఛత్తీస్గఢ్లో వర్షాలు పడుతుండడం వల్ల జలధారలు కనువిందు చేస్తున్నాయి.
వడివడిగా జలధారలు
కొండ కోనల్లో నుంచి వడివడిగా పరుగులు తీస్తున్న జలధారలు సందర్శకులను కట్టి పడేస్తున్నాయి. గత రెండు వారాలుగా ఈ ప్రాంతం పర్యాటకులతో సందడిగా మారింది. వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ నుంచే కాకుండా... పొరుగున ఉన్న చత్తీస్గఢ్, మహారాష్ట్రల నుంచి కూడా పర్యాటకులు ఇక్కడకు విచ్చేస్తున్నారు. జలపాత అందాలను తనివితీరా ఆస్వాదిస్తూ... జలాల్లో జలకాలాడుతున్నారు.
ప్రధానంగా వారాంతాల్లో బొగత పరిసరాలు జనసంద్రంగా మారుతున్నాయి. జలపాత అందాలతో పాటు అటవీ ప్రాంత పరిసరాలు కూడా ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. బొగత సందర్శనకు వచ్చేవారికి రవాణాతో పాటు పర్యటక శాఖ తరఫున కొన్ని వసతులు ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది.
ఇదీ చూడండి : రైతన్న గట్టిగా అనుకున్నాడు.. ఇంజినీర్ అయిపోయాడు!