Sand Dunes in Farm Lands : గత నెలలో కురిసిన భారీ వర్షాలు ములుగు జిల్లాను (Floods in Mulugu) అతలాకుతలం చేశాయి. వరదల తాకిడికి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లు నీటమునిగి 13 మంది జల సమాధి అయ్యారు. ఈ ఏడాది ఆరుద్ర, పునర్వసు కార్తుల్లో చెదురుమదురుగా వర్షాలు పడ్డాయి. గత నెల 20న పుష్యమి కార్తీ రావడంతో వర్షాలు కురవడం మొదలుపెట్టాయి. ఆ తర్వాత కురిసిన భారీ వర్షానికి చెరువులు, కుంటలు నిండి నిండుకుండలను తలపించాయి. కొన్ని చెరువుల ఆనకట్టలు తెగిపోయాయి. మొత్తంగా భారీ వర్షాలు, వరదలతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.
నాట్లు పోయి.. ఇసుక మేటలు వచ్చే..: ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో కురిసిన భారీ వర్షానికి గుండ్ల వాగు ప్రాజెక్టు మత్తడి పోయడంతో గుండ్ల వాగు వరద ఉద్ధృతంగా ప్రవహించింది. ప్రాజెక్టు కింద ఉన్న గుండ్ల వాగు ప్రాజెక్టు మత్తడి వరదతో పాటు.. అడవి నుంచి వచ్చే ఎర్రం వాగు గుండ్ల వాగుకు మధ్యలో కలుస్తుంది. ఈ రెండు వాగుల వరద ప్రవాహానికి లక్ష్మీపురం, అమృత్ తండా, ముద్దులగూడెం, పస్రా నాగారం గ్రామాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. ఇక్కడి గ్రామాల రైతులు సాగు చేసుకునే 400 ఎకరాలకు పైగా పంట పొలాలపై వరద ప్రవహించి నాటు వేసిన పొలాలు కొట్టుకుపోయి ఇసుక మేటలు వేసింది. (Sand Dunes in Farming lands)
Sand Dunes in Crop Lands Karimnagar : పంట భూముల్లో ఇసుక మేటలు.. దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు
"చాలా సార్లు వరదలు వచ్చినా ఇంత పెద్దగా రాలేదు. పొలాలు, మోటార్లు, ట్రాక్టర్లు అన్నీ కొట్టుకుపోయాయి. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వమే ఇసుక మేటలు తొలగించి, పరిహారాన్ని ఇచ్చేలా చూడాలి." - బాధిత రైతులు
Sand Dunes in Farm Lands in Mulugu : పస్రా గ్రామ సమీపంలోని గుండ్ల వాగుకు ఆనుకుని ఉన్న పంట పొలాలకు ఎంత వరద వచ్చినా.. పొలాలు దెబ్బ తినకుండా వాగుకు కరకట్ట కట్టారు. గత నెలలో కురిసిన భారీ వర్షాలకు (Heavy Rains in Telangana) వరద ప్రవహించడంతో 80 ఎకరాల్లో నాటు వేసిన పొలాలు కొట్టుకుపోయి 3 ఫీట్ల మేర ఇసుక మేటలు వేసిందని వాపోయారు. వరదల ధాటికి పంట పొలాల్లో ఉన్న మోటార్లు కూడా కొట్టుకుపోయాయని, నాట్లు వేసే సీజన్లో పొలంలో ఉంచిన ట్రాక్టర్లు కూడా కొట్టుకుపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట పొలాల్లో పేరుకుపోయిన ఇసుక మేటలను చూసి రైతులు బోరున విలపిస్తున్నారు.
వరదలు ప్రవహించి (Floods Effect in Mulugu) 15 రోజులు గడిచినప్పటికీ ఏ ఒక్క అధికారి కూడా రాలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలాలపై పేరుకుపోయిన ఇసుక మేటలు తొలగించాలంటే కనీసం రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు ఖర్చవుతుందని రైతులు పేర్కొన్నారు. ఈ సమస్యను ప్రభుత్వమే బాధ్యతగా తీసుకొని ఇసుక మేటలను తొలగించాలని లేదా రైతులకు పరిహారం చెల్లించాలని రైతులు కోరారు. నిత్యం ప్రవహించే గుండ్ల వాగుకు ఇంతకుముందు ఉన్నట్టుగానే గుండ్ల వాగు బ్రిడ్జి వద్ద నుంచి రెండు కిలోమీటర్ల మేర కరకట్ట నిర్మించాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు వరదల వల్ల దెబ్బతిన్న పంట పొలాలను పూర్తి స్థాయిలో పరిశీలించి పరిహారం అందించాలని వేడుకుంటున్నారు.