రామప్ప సరస్సులో మునిగిపోయిన పంట భూములకు నష్టపరిహారం చెల్లించాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. ఈ మేరకు జంగాలపల్లి గ్రామ సమీపంలోని మేడి వాగు వద్ద జాతీయ రహదారిపై కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. 300 మంది రైతులు, కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ నాయకులతో గంటన్నరపాటు ధర్నా నిర్వహించారు.
ములుగు, వెంకటాపూర్ మండలాల్లో 12 గ్రామాల్లో ఆరువందలకు పైగా రైతులున్నారని.. 2200 ఎకరాల పంట నీట మునిగిందని ఆరోపించారు. ఆ భూములకు రాష్ట్రప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించడం లేదని సీతక్క ఆరోపించారు. రైతుబంధు పేరుతో రైతులను మోసం చేస్తూ ఒక్కొక్క ఎరువుల బస్తాకు అధిక రేట్లు పెట్టి రైతులను దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు కూడా భూ స్వాములకే లక్షల్లో డబ్బులు అందుతున్నాయని.. సన్నకారు రైతులకు రైతుబంధు వచ్చినా పెట్టుబడులకు సరిపోక అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
భారీ వర్షాలతో సరస్సు నిండిపోతోందని.. యాసంగిలో రైతులు నాట్లు వేసుకున్నాక దేవాదుల ద్వారా సరస్సును నింపుతున్నారని సీతక్క ఆరోపించారు. దీంతో పంట పొలాలు ముంపునకు గురవుతున్నాయని వివరించారు. రామప్ప సరస్సులో మునిగిపోయిన పంట భూములకు నష్టపరిహారం చెల్లించే వరకు పోరాటం చేస్తామని.. వారం రోజుల్లో కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ అంశంపై అసెంబ్లీలో ప్రస్తావిస్తానని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: Medicine from the sky : వికారాబాద్‌లో మెడిసిన్ ఫ్రమ్ ది స్కై ప్రాజెక్టు ప్రారంభం