Medaram Jatara 2022: ఈనెల 16 నుంచి 19 వరకు జరగనున్న మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఏర్పాట్లను మంత్రి సత్యవతి రాఠోడ్ పరిశీలించారు. జంపన్న వాగు దగ్గర స్నాన ఘట్టాలను, ఇతర సదుపాయలను చూశారు. జంపన్న వాగు వద్ద సౌకర్యాలపై భక్తులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కుటుంబసభ్యులతో కలిసి జంపన్నవాగులో పూజలు చేసి, పుణ్యస్నానం చేశారు. తర్వాత తలనీలాలు(3 కత్తెరలు) సమర్పించారు.
మేడారం జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలిపారు. భక్తులు సంతృప్తికరంగా అమ్మవార్లను దర్శనం చేసుకుని... క్షేమంగా వెళ్లేలా చర్యలు తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. 3,850 బస్సుల ద్వారా... 21 లక్షల మంది ప్రయాణికులను చేరవేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. మేడారంలో ఆసుపత్రి సహా 35 హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఎవరైనా పిల్లలు తప్పిపోతే వారిని సంరక్షించేందుకు 18 ప్రాంతాల్లో క్యాంపులు పెట్టారు.
Medaram Devotees: తెలంగాణ కుంభమేళాగా పేరొందిన సమ్మక్క సారలమ్మ జాతరకు తెలుగురాష్ట్రాలతో ఛత్తీస్గఢ్, మహారాష్ట్రాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. కుటుంబసమేతంగా వచ్చిన భక్తులు జంపన్నవాగులో స్నానాలు చేసి వనదేవతలను దర్శించుకుంటున్నారు. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయలకు నెలవైన సమ్మక్క సారలమ్మ మహా జాతరకు... రెండు వారాల ముందు నుంచి గుడిమెలిగే, మండమెలిగే పండగలు నిర్వహించడం ఆచారంగా వస్తోంది.
ఈసారి 75 కోట్ల రూపాయలతో..
మరోవైపు మహాజాతర ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ప్రభుత్వం ఈసారి 75 కోట్లు వెచ్చించి భక్తులకు సకల సౌకర్యాలు కల్పించింది. కొవిడ్ దృష్ట్యా 30 వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి.... వీటన్నింటికీ అనుసంధానంగా... తితిదే కల్యాణ మండపంలో... మెగా మెడికల్ క్యాంపును అధికారులు ఏర్పాటు చేశారు. గతంలో లేనంతగా... ఈ ఏడాది జనవరి మొదటివారం నుంచే భక్తుల సంఖ్య పెరగగా... ఈసారి కోటి 30లక్షలకు పైగా భక్తులు దర్శించుకుంటారని అధికాలు అంచనా వేస్తున్నారు. జాతరను విజయవంతంగా నిర్వహించడమే లక్ష్యంగా... 11వేలమంది పోలీసులు విధులు నిర్వహిస్తారని వరంగల్ సీపీ తరుణ్ జోషి తెలిపారు.
ఇదీ చూడండి: Heli Taxi At Medaram: మేడారం జాతరకు హెలికాప్టర్లో వెళ్లొచ్చు!