మేడారం జాతరలో ట్రాఫిక్ నిర్వహణ అనేది ప్రధానమైన అంశం. వేలాది వాహనాలు తరలిరానున్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లుచేశారు. ఇప్పటికే వాహన రాకపోకలకు ఇబ్బంది లేకుండా వన్ వే పద్ధతిని అనుసరిస్తున్నారు. మేడారం జాతర నేపథ్యంలో వాహనాల రాకపోకలతోపాటు రోడ్లపై ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ప్రదేశాల ఏర్పాట్లను ఇప్పటికే అధికారులు పూర్తి చేశారు.
2లక్షల వాహనాలకు సరిపడ పార్కింగ్..
జాతరకు విధులు నిర్వహించనున్న 10 వేలమంది పోలీసుల సిబ్బందిలో 4 వేల మంది ట్రాఫిక్ నియంత్రణకు పనిచేయనున్నారు. ఒకేసారి 2 లక్షలకు పైగా వాహనాలను నిలిపి ఉంచేలా చుట్టుపక్కల 38 పార్కింగ్ ప్రదేశాలను సిద్ధం చేశారు. రహదారులను 20 సెక్టార్లుగా విభజించి ఇద్దరు డీసీపీలు, ఓ ఎస్పీని ఇన్ఛార్జిగా నియమించారు.
200 సీసీ కెమెరాలు.. 24 గంటల గస్తీ..
మల్లంపల్లి నుంచి ఊరట్టం వరకూ 30 బృందాలు మోటారు సైకిళ్లపై మూడు షిఫ్టుల్లో 24 గంటల పాటు గస్తీ నిర్వహించనున్నాయి వాహనాల రాకపోకలను పరిశీలించేందుకు 200 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటిని పస్రా, మేడారంలోని కమాండ్ కంట్రోల్ రూంలకు అనుసంధానించారు. ప్రతి క్షణం రోడ్లపై వాహనాల రాకపోకలను పరిశీలిస్తూ... సమస్యలను పరిష్కరించునున్నారు.
విశ్రాంతి కోసం హోల్డింగ్ పాయింట్లు..
అమ్మలను దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వాహనదారులు విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా హన్మకొండ-పస్రా మధ్య హోల్డింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. అలసటకు గురైన వాహనాదారులు సేద తీరేందుకు ఇవి ఉపయోగపడనున్నాయి. ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తూ... బాధ్యాతాయుతంగా వాహనాలు నడపాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవీ చూడండి:వనమంతా జనమయ్యేది రేపట్నుంచే..