Karregutta Encounter: తెలంగాణ-చత్తీస్‌గఢ్ సరిహద్దులో ములుగు జిల్లా వెంకటాపురం మండలం కర్రిగుట్టల వద్ద మంగళవారం(జనవరి 18) జరిగిన ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ.. ఈ నెల 22న జిల్లా బంద్‌కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఇది బూటకపు ఎన్‌కౌంటర్‌గా పేర్కొంటూ.. జేఎండబ్ల్యూపీ కార్యదర్శి వెంకటేష్ పేరుతో మావోయిస్టులు ఓ ప్రకటన విడుదల చేశారు. రాజకీయ నాయకులను, సర్పంచులను కాంట్రాక్టర్లను చంపడానికి పథకం రచిస్తున్నారని పోలీసులు పేర్కొనడంలో వాస్తవం ఎంత మాత్రం లేదన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం పది మందితో కూడిన తమ దళం సమావేశమైనప్పుడు దొంగచాటుగా దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమీపం నుంచి ఏకపక్ష కాల్పులు జరిపారని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కాల్పుల్లో వాజేడు వెంకటాపురం ఏరియా కమిటీ కార్యదర్శి శాంత అలియాస్ మడకం సింగే, ఇల్లెందు, నర్సంపేట దళ కమాండర్ కొమ్ముల నరేష్, దంతెవాడ జిల్లాకు చెందిన కోవాసీ మూయాల్ అలియాస్ కైలాష్ హతులైయ్యారని తెలియజేశారు. బంద్‌లో అన్ని వర్గాల ప్రజలు, వ్యాపారులు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలంటూ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
సంబంధిత కథనం..