ములుగు జిల్లాలోని పలు గ్రామాల ప్రజలు ఉదయమే ఉపాధి కూలి పనులకు బయలుదేరుతారు. ఉదయం ఆరు గంటలకు వెళ్తారు. అక్కడికెళ్లి చేతులతో గుంతలు తవ్వుతారు. పనిచేసే సమయంలో వారికి తాగేందుకు నీళ్లు లేని పరిస్థితి. దాహం వేసినా అలాగే ఉంటారు. ఎంత ఎండగా ఉన్నా మైళ్ల దూరం నడుస్తారు. కనీస సదుపాయలన్నీ కల్పించాల్సిన బాధ్యత ఫీల్డ్ అసిస్టెంట్లు, ఉపాధిహామీ అధికారులదే అయినప్పటికీ ఎవరూ పట్టనట్టుగా ఉంటున్నారు.
అడువుల్లోనే ఉపాధి హామీ పనులు
అడవుల్లో నీటినిల్వ కోసం ఉపాధి హామీ కింద గుంతలు తవ్వే పనులను చేపట్టారు. అందులో భాగంగానే కూలీలకు గడ్డపారలు, పారలు, తాగునీటి సౌకర్యం వంటివి కల్పిస్తారు. కానీ ప్రస్తుతం ఎలాంటి ఏర్పాట్లు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇవ్వాల్సిన పనిముట్లు ఇంతవరకు ఇవ్వలేదని, సొంత పనిముట్లతోనే ఉపాధి కూలి పని చేస్తున్నామని కూలీలు చెబుతున్నారు.
చేతులు బొబ్బలెక్కినా.. గుంతలు కావట్లేదు
మీటరు లోతు మూడు మీటర్ల పొడవుతో గుంతలు తీస్తేనే సరైన కూలి పడుతుందని, లేని పక్షంలో తక్కువ డబ్బులు వస్తాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే ఎండాకాలం, ఆపై నీళ్లు కూడా లేని ప్రాంతం కావడం వల్ల ఎంత తవ్వినా గుంతలు కావట్లేదంటున్నారు. అందుకోసం ఇంటి నుంచి నీళ్లు తీసుకొచ్చి ముందురోజు మట్టిలో నీల్లు పోస్తేనే గుంతలు తవ్వగల్గుతున్నామని వాపోతున్నారు. తమకే తాగేందుకు నీళ్లులేవంటే... భూమిపై పోసేందుకు కూడా తీసుకురావాల్సి వస్తుందని... అంతచేసినా సరైన కూలీ రావట్లేదని చెబుతున్నారు.
కనీస సౌకర్యాలు అందించండి
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సరైన పనిముట్లు అందిచాలని కూలీలు కోరుతున్నారు. అలాగే కూలి పని చేస్తున్న సమయంలో మంచి నీరు అందించాలని, భూమి గట్టిగా ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్ ద్వారా నీరందించాలని డిమాండ్ చేస్తున్నారు. అలా అయితేనే తమ కష్టానికి విలువ దక్కుతుందంటున్నారు. 15 రోజులకోసారి వచ్చే ఉపాధి కూలీ డబ్బులను వారానికొకసారి ఇస్తే తమకు కాస్త సాయంగా ఉంటుందని కూలీలు తెలిపారు.
ఇవీ చదవండి: అంతరించిపోతున్న హైదరాబాద్ నక్కల చెరువు