GCC GIRI brand soaps : గిరిజన మహిళల ఆర్థిక స్వావలంబన కోసం వివిధ రకాల యూనిట్ల ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కృషి చేస్తోంది. ములుగు జిల్లా ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలోని మహిళల కోసం డిటర్జెంట్ సబ్బుల యూనిట్ నెలకొల్పాలని కమిషనర్ క్రిస్టీనా ఆలోచన చేశారు. ఇలాంటి ప్రతిపాదనలు కార్యరూపం దాల్చకపోవటంతో.. ఎవరూ ముందుకు రాలేదు. శివాపురం గ్రామానికి చెందిన 18 మంది మహిళలు ముందడుగు వేశారు. గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకున్నారు. అనంతరం బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవటంతో... జీసీసీ అందించిన 25 లక్షల సాయంతో... 2019 డిసెంబర్ 20న డిటర్జెంట్ సబ్బుల తయారీ యూనిట్ ప్రారంభించారు.
మొదటి దఫాలోనే..
యూనిట్ స్థాపించిన సమయంలో లబ్ధిదారుల భాగస్వామ్యం కింద 2 లక్షలు చెల్లించాలని అధికారులు చెప్పడంతో కొందరు ముందుకు రాలేదు. రోజువారీ కూలీ అయితేనే చేరుతామని చెప్పటంతో.... 9 మంది మాత్రమే యూనిట్‌ను స్థాపించారు. శ్రీ సమ్మక్క సారలమ్మ జేఎల్జీ గ్రూప్ పేరిట ఏర్పాటు చేసుకున్నారు. 'గిరి' డిటర్జెంట్ పేరుతో సబ్బుల తయారీ మొదలుపెట్టారు. మొదటి దఫాలో 2 లక్షల 79 సబ్బులు తయారు చేశారు. మార్కెటింగ్ ఇబ్బంది కాకుండా జీసీసీ ఆధ్వర్యంలో గిరిజన ఆశ్రమ పాఠశాలకు సరఫరా చేశారు. ఒక్కో సబ్బుకు 9 రూపాయల చొప్పున జీసీసీ చెల్లిస్తోంది. మొదటి దఫాలోనే 25 లక్షలు రావడంతో జీసీసీ ఇచ్చిన రుణం చెల్లించారు.
కొవిడ్ పరిస్థితుల నుంచి కోలుకుని
యూనిట్ స్థాపించిన 3 నెలలకి కరోనాతో హాస్టళ్లు పాఠశాలలు మూతపడడంతో ఆర్డర్లు రాలేదు. దీంతో మళ్లీ కూలి పనులకు వెళ్లారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో పాఠశాలలు తెరుచుకున్నాక యూనిట్ ప్రారంభించారు. గడిచిన 3 నెలల్లో 4 లక్షల సబ్బులను తయారుచేసి సరఫరా చేశారు. ఏడాదిలోనే 60 లక్షల వ్యాపారం నిర్వహించామని సభ్యులు తెలిపారు. ప్రస్తుతానికి యూనిట్‌ను విజయవంతంగా నిర్వహిస్తున్నామని మహిళలు వెల్లడించారు.
ఇదీ చూడండి: GCC Giri brand soap : గిరిపుత్రులకు అండగా... 'గిరి' సబ్బుల పరిశ్రమ