తెలంగాణకు మరో రాష్ట్రం నుంచీ పెద్దపులుల వలస మొదలైంది. ఏటూరు నాగారం అభయారణ్యానికి మూడునెలల క్రితం ఓ పెద్దపులి రాగా తాజాగా మరో పులి పాదముద్రలు కనిపించాయి. ఈ రెండు ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి టైగర్ రిజర్వు నుంచి వచ్చినట్లు.. ఇక్కడి నుంచి మహబూబాబాద్ జిల్లాకు వెళ్లినట్లు అటవీ శాఖ అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఏటూరు నాగారం అభయారణ్యం వ్యూహాత్మక ప్రాంతంలో ఉండటంతో టైగర్ కారిడార్ ప్రతిపాదన తాజాగా తెరపైకి వచ్చింది.
టైగర్ రిజర్వుగా ఏటూరు నాగారం..!
కవ్వాల్ టైగర్ రిజర్వుతో కలుపుతూ ఈ ప్రాంతానికి కారిడార్‌గా గుర్తింపు తీసుకురావడంపై రాష్ట్ర అటవీ శాఖ దృష్టి సారించింది. జాతీయ పులుల సంరక్షణ సంస్థ కూడా సానుకూలంగా ఉండటంతో కొత్తగా వస్తున్న పులుల సంరక్షణకు అధికారులు కార్యాచరణ ప్రణాళిక కసరత్తు మొదలుపెడుతున్నారు. మహారాష్ట్రలో తడోబా, తిప్పేశ్వర్.. ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి టైగర్ రిజర్వులు రాష్ట్ర సరిహద్దులకు దగ్గరలోనే ఉన్నాయి. తడోబా - కవ్వాల్ - ఇంద్రావతి మధ్య ప్రాంతంలో ఏటూరునాగారం ఉంది. దీన్ని కారిడార్‌గా గుర్తిస్తే.. ఈ ప్రాంతంలో పెద్దపులుల సంఖ్య పెరుగుతుందని అటవీశాఖ భావిస్తోంది.
బెజ్జూరులో పెద్దపులి
కుమురం భీం జిల్లా బెజ్జూరు అడవుల్లో పెద్దపులి సంచరిస్తోంది. బెజ్జూరు మండలం సులుగుపల్లి సమీపంలోని గొల్లదేవార వద్ద శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో పులి రోడ్డు దాటుతుండగా అక్కడే పనిచేస్తున్న కూలీలు చూశారు. వారీ విషయాన్ని బీట్ అధికారి సుధీర్ దృష్టికి తీసుకెళ్లారు. తర్వాత తనకు పులి మళ్లీ కనిపించినట్లు బీట్ అధికారి చెప్పారు. గత నెల రోజుల్లో రెండు సార్లు పెద్దపులి అదే ప్రాంతంలో సంచరించింది. దీంతో సలుగుపల్లి-పెంచికల్‌పేట్ మార్గంలో ప్రయాణించేందుకు ప్రజలు భయపడుతున్నారు.
- ఇదీ చూడండి పులికి చెమటలు పట్టించిన ఏనుగు!