Medaram Jatara 2022 : ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతర అయిన మేడారం మహాజాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. సమ్మక్క- సారలమ్మ ఆశీర్వాదాల కోసం వేలాదిగా తరలి వస్తున్నారు. జాతర పరిసరాలు భక్తజన సంద్రంగా మారాయి. వివిధ ప్రాంతా నుంచి వచ్చిన భక్తులు జంపన్న వాగు వద్ద పుణ్యస్నానాలు చేస్తున్నారు. గద్దెలపై కొలువుదీరిన అమ్మవార్ల దర్శనంతో భక్తులు తన్మయత్వం పొందుతున్నారు. అమ్మవార్లకు నిలువెత్తు బెల్లాన్ని కానుకగా సమర్పిస్తున్నారు. బెల్లం చీరెసారెలు, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
ట్రైబల్ సర్క్యూట్‌గా
పలువురు ప్రజాప్రతినిధులు మేడారానికి తరలివచ్చి.. అమ్మలను దర్శించుకుంటున్నారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, కేంద్ర గిరిజనాభివృద్ధి శాఖ మంత్రి రేణుసింగ్ అమ్మవార్లను దర్శించుకున్నారు. అంతకముందు కిషన్‌రెడ్డి.. నిలువెత్తు బంగారం తులాభారం సమర్పించారు. అనంతరం దేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలకు మేడారం జాతర ప్రతీక అని కిషన్‌రెడ్డి అన్నారు. 45 కోట్లతో ములుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. త్వరలోనే పనులు పూర్తిచేస్తామని చెప్పారు. మేడారం పరిసర ప్రాంతాలు ట్రైబల్ సర్క్యూట్‌గా అభివృద్ధి చేస్తామని అన్నారు.
కేసీఆర్ ప్రధాని కావాలి
మేడారం సమ్మక్క-సారలమ్మను మంత్రి మల్లారెడ్డి దర్శించుకున్నారు. అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. కేసీఆర్ ప్రధాని కావాలని అమ్మవార్లను మొక్కుకున్నానని మంత్రి తెలిపారు. గతంలో తాను కోరిన కోర్కెలను అమ్మవార్లు నెరవేర్చారని చెప్పారు. అమ్మ వార్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ మాలోతు కవిత, బండ ప్రకాశ్ సహా పలువురు నాయకులు అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేడారం జాతర సవ్యంగా సాగుతోందని తెలిపారు.
గిరిజనులను అవమానించడమే
సమ్మక్క, సారలమ్మలను భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ బాపురావు, ఎస్టీ మోర్చా జాతీయాధ్యక్షుడు, ఎంపీ సమీర్ ఒర్మన్ దర్శించుకున్నారు. కరోనా కష్టాలు తొలగిపోయి ప్రజలు సుఖ శాంతులతో ఉండాలని ఆ అమ్మవార్లను వేడుకున్నానని బండి సంజయ్ తెలిపారు. గత జాతరలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని... ఆ హామీలపై ప్రజలకు సమాధానం చెప్పలేకే సీఎం మేడారం రాలేదని విమర్శించారు. సీఎం మేడారం రాకపోవడం.. గిరిజనులను అవమానించడమే అన్నారు. సీఎం ఎక్కడికెళ్లినా హామీల వర్షమే తప్ప అమలు శూన్యమని ఆరోపించారు. మేడారం జాతరకు 3, 4 రోజులు సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. భాజపా అధికారంలోకి వస్తే మేడారం జాతరను కుంభమేళా మాదిరి నిర్వహిస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు.
కేసీఆర్ పర్యటన లేనట్లే!
ముఖ్యమంత్రి కేసీఆర్ మేడారం పర్యటన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే సీఎం పర్యటన రద్దు అయినట్లు సమాచారం. మరోవైపు జాతరలో కొబ్బరికాయలు, బంగారు(బెల్లం) ధరలు కొండెక్కాయని భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొబ్బరికాయ రూ.50, బెల్లం కేజీ రూ.80 నుంచి రూ.120 వరకు అమ్ముతున్నారని భక్తులు మండిపడుతున్నారు. రేపే చివరి రోజు కావడంతో అమ్మవార్ల దర్శనానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. గద్దెల వద్ద తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. రేపు సాయంత్రం అమ్మవార్లు వన ప్రవేశం చేయనున్నాయి.
ఇదీ చదవండి : పెద్దమ్మ ఆగమనం.. భక్తజన పారవశ్యం