Medaram: మేడారం మహాజాతరకు సమయం దగ్గరపడుతున్న వేళ.. ఆలయ పరిసరాలు రద్దీగా మారుతున్నాయి. ఫిబ్రవరి 16 నుంచి నాలుగు రోజులపాటు మహాజాతర జరగనుంది. ఈనేపథ్యంలో ముందస్తు మొక్కుల చెల్లింపులు ఊపందుకున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు మేడారం బాట పడుతున్నారు. వనదేవతల దర్శనం కోసం పోటెత్తుతున్నారు. జంపన్న వాగులో స్నానాలు చేసి గద్దెల చెంతకు వస్తున్నారు. క్యూలైన్ల గుండా వెళ్లి తల్లులను దర్శించుకుంటున్నారు. సమ్మక్క, సారలమ్మకు పసుపుకుంకుమలతో పూజలు చేసి బంగారం నైవేద్యంగా సమర్పిస్తున్నారు. తొలుత గద్దెల లోపలికి అనుమతించగా.. రద్దీ పెరగడంతో బయటి నుంచే దర్శనాలకు అనుమతిస్తున్నారు.
Jathara: మేడారానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. స్నానఘట్టాలు, మరుగుదొడ్ల పనులు జోరుగా సాగుతున్నాయి. మేడారం మహా జాతరకొచ్చే భక్తులకు వసతులు కల్పిస్తామని ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య తెలిపారు. సమ్మక్క, సారలమ్మలను దర్శించుకున్న ఆయన అకాల వర్షాల వల్ల ఏర్పాట్లకు కొంతమేర ఆటంకం కలిగినా సకాలంలో పూర్తయ్యేలా చర్యలు చేపట్టామని తెలిపారు. కరోనా పరిస్థితుల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. వనదేవతల దర్శనానికి వచ్చే భక్తులు.. కరోనా నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.
devotees in jathara: భక్తులను మేడారం జాతరకు తరలించేలా ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలలోని డిపోల నుంచి భక్తుల సౌకర్యార్థం బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. సమ్మక్క సారలమ్మ దేవాలయం వద్ద బస్టాప్ ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్టాప్‌లో దిగిన భక్తులు వనదేవతల దర్శనం చేసుకుని తిరుగుపయనం అవుతున్నారు. ఆర్టీసీలో ప్రయాణం చాలా సుఖమయంగా ఉందని.. గుడి దగ్గరికి తీసుకువెళ్లి దర్శనభాగ్యం పొందేలా ఏర్పాట్లు చేశారని భక్తులు హర్షం వ్యక్తం చేశారు. మేడారం మహా జాతరకు జరుగుతున్న పనుల పురోగతిపై ఇవాళ మంత్రి సత్యవతి రాఠోడ్ అధికారులతో సమీక్షించనున్నారు.