కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ములుగు జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై ఎమ్మెల్యే సీతక్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, రైతులు ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ బిల్లులు రైతుల నడ్డి విరిచేలా ఉన్నాయని ఎమ్మెల్యే సీతక్క తెలిపారు. చిన్న, సన్నకారు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారే అవకాశం ఉందన్నారు. రైతులు పండించిన పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చన్న అంశం వల్ల కార్పొరేట్ శక్తులు, భూస్వాములు మాత్రమే లబ్ది పొందుతారని చెప్పారు. పేద, మధ్య తరగతి రైతులు మరింతగా నష్టపోతారన్నారు. పంటకు గిట్టుబాటు ధర కల్పించకపోతే దళారుల చేతుల్లో రైతులు నష్టపోక తప్పదన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి.. ఇంతవరకు అమలు చేయలేదని ఆమె మండిపడ్డారు.రాష్ట్ర సర్కారు రైతుబంధు పేరుతో సాయం చేసినట్టు నమ్మిస్తూనే పంట కొనుగోలు సమయంలో మిల్లర్లతో కుమ్మక్కై క్వింటాలుకు 8 నుంచి 10 కేజీలు కోత పెడుతోందని విమర్శించారు. సన్నరకం ధాన్యానికి రూ.2500, పత్తి పంటకు 8వేల మద్దతు ధర కల్పించాలని ఆమె కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. మొక్కజొన్న పంట కొనుగోలు చేసి.. మద్దతు ధర చెల్లించాలని కోరారు. ఆర్డీవో రమాదేవికి ఎమ్మెల్యే సీతక్క వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నల్లల కుమారస్వామి, కిసాన్‌సెల్ అధ్యక్షులు రాజేందర్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: ప్రభుత్వం అరచేతిలో వైకుంఠం చూపిస్తోంది: పొంగులేటి